Nitish Kumar: లోక్సభ ఎన్నికల వేళ బీహార్లో రాజకీయాలు తొందరగా మారుతున్నాయి. సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, లాలూ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో మహాకూటమిలోని ఆర్జేడీతో తెగతెందపులు చేసుకునేందుకు జేడీయూ చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సిద్ధమైనట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్డీయే కూటమితో చేతులు కలిపేందుకు నితీశ్ మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.
నితీశ్.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి పదవికి శనివారం నాడు నితీశ్ రాజీనామా చేయబోతున్నారంటూ సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆయనతోపాటు వెళ్తారని తెలిపాయి. ఇక నితీశ్ ఆదివారం రోజున 9వసారి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని, డిప్యూటీ సీఎంగా బీజేపీ నాయకుడు సుశీల్ మోదీ ప్రమాణం చేసే అవకాశాలున్నాయని వెల్లడించాయి.