మన దేశానికి ఇతర దేశాలకు మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా? పరిశుభ్రత. మన ఇంట్లో మనం బాగానే పరిశుభ్రంగా ఉంటాం. కానీ.. ఎప్పుడైతే బయటికి వెళ్తామో అప్పుడే దాన్ని మరిచిపోతాం. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తుంటాం. రోడ్ల మీదికి చెత్త విసిరేస్తుంటాం. ఎక్కడ చెత్త వేసినా అడిగేవాళ్లు ఉండరు కాబట్టి మనదే ఇష్టా రాజ్యం. కానీ.. కొన్ని దేశాల్లో రోడ్ల మీద చెత్త వేస్తే కఠిన శిక్షలను అమలు చేస్తారు. అందుకే అక్కడి పౌరులు పరిశుభ్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు గురించి తెలుసు కదా. ఆ ట్రెయిన్ ను మొత్తం చెత్త చెత్త చేసేశారు ప్రయాణికులు. వందేభారత్ రైలు లోపల మొత్తం చెత్తతో నిండిపోయింది. స్వీపర్ ఆ చెత్తను ఊడ్చేందుకు రైలు లోపలికి వెళ్లగా అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యాడు.
దాన్ని ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? ప్రయాణికులను ఒక ఆట ఆడుకుంటున్నారు. వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను కూడా వదలడం లేదా? ఈ దేశ పౌరులుగా మనకు కొంచెమైనా బాధ్యత ఉండాలి కదా. రైలును అలా చెత్తగా మార్చేస్తే ఎలా? మనం ఇక మారమా? మన దేశం బాగుపడాలంటే ముందు మనం బాగుపడాలి.. అంటూ నెటిజన్లు తమకు తోచినట్టుగా ఆ ఫోటోపై కామెంట్లు చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోను ముందు అవానిష్ శరణ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ట్విట్టర్ లో షేర్ చేశారు.