టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం మదనపల్లి నుంచి ప్రారంభమైంది. బొంరాస్‌పేటలో గల ఆంజనేయస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పాదయాత్రను ప్రారంభించారు. మదనపల్లి నుంచి దుద్యాలకు సాగుతుండగా రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ కూలీలను పలకరించారు. రైతులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు.పెట్టుబడి ఖర్చులు, మార్కెట్లో పంటకు లభిస్తున్న ధర గురించి అడిగారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని తన పాదయాత్రలో గ్రామగ్రామానికి తీసుకువెళతామని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని రేవంత్ అన్నారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిజాం, బ్రిటిషర్ల పాలనను తలపిస్తున్నాయని ఆరోపించారు. గత తొమ్మిదేళ్లుగా ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నెరవేర్చలేదన్నారు. ధరల పెరుగులతో సామాన్యుడు ఏం కొనెట్టు లేదు.. ఏం తినెట్టు లేదన్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాహుల్ వెంట రేవంత్ ఉన్నారు. ప్రజల కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు. మరింత క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపడుతానని ఆ రోజే చెప్పారు. ఈ రోజు నుంచి తొలి విడత యాత్రను ప్రారంభించారు.