»Israel Hamas Hamas Largest Command Center Out Of Gaza
Israel-Hamas: గాజాలో బయటపడ్డ హమాస్ అతిపెద్ద కమాండ్ సెంటర్
హమాస్ భీకర దాడులు గాజాలో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎంతోమంది ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా గాజా సిటీలో హమాస్ అతిపెద్ద కమాండ్ సెంటర్ బయటపడింది. కానీ దీనిని ఎక్కడ గుర్తించారన్న విషయాన్ని మాత్రం ఇజ్రాయెల్ తెలపలేదు.
Israel-Hamas: గాజాలో ఇప్పటికీ భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గాజా సిటీలో హమాస్ అతిపెద్ద కమాండ్ సెంటర్ బయటపడింది. దీని నుంచే హమాస్ తన భూగర్భ సొరంగ నెట్వర్క్ మొత్తాన్ని నిర్వహిస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. కానీ ఈ కమాండ్ సెంటర్ను ఎక్కడ గుర్తించిందో మాత్రం ఇజ్రాయెల్ వెల్లడించలేదు. బందీలను విడుదల చేయడానికి ఇజ్రాయెల్ మరో ఒప్పందాన్ని ప్రతిపాదించింది. హమాస్ చెరలో ఉన్న 40 మంది విడుదల కోసం 7 రోజుల ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రతిపాదించగా.. హమాస్ దాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది.
గాజా పట్టీలో ఇజ్రాయెల్ తమ దాడులను పూర్తిగా నిలిపివేస్తేనే సంధిపై చర్చిస్తామని మధ్యవర్తిగా ఉన్న ఈజిప్టు ప్రతినిధులకు హమాస్ చెప్పింది. అలాగే ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను అప్పగిస్తే బంధీలను విడిచిపెడతామని హమాస్ షరతు పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై జో బైడెన్ స్పందిస్తూ.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య డీల్ జరిగే అవకాశాలు కనిపించట్లేదని అన్నారు. గాజాలో ఇంకా ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులపై అంతర్జాతీయంగా కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. ఇజ్రాయెల్ వెనక్కి తగ్గాలని సూచిస్తున్నాయి. ఈ భీకర యుద్ధంలో ఇప్పటివరకు 20వేల మంది గాజావాసులు మరణించినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. మృతుల్లో దాదాపు 8వేల మంది చిన్నారులే ఉన్నారు. భూతల దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇజ్రాయెల్ వైపు 130 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐడీఎఫ్ తెలిపింది.