Israel-Hamas: హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని గాజాలో జరిగే దాడులను వెంటనే ఆపేయాలని ఇజ్రాయెల్‌ను ఇరాన్ హెచ్చరించింది. గాజాపై జరుగుతున్న భీకర దాడులను వెంటనే ఆపకపోతే ఇజ్రాయెల్‌పై కఠిన చర్యలు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమిరబ్దొల్లాహియాన్ హెచ్చరించారు. గాజాపై బాంబు దాడులు ఆపకపోతే యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని ఐక్యరాజ్యసమితి ద్వారా ఇజ్రాయెల్‌కు చెప్పించింది. హమాస్ దాడులు ఆరంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు మద్దతు ఇస్తున్న అమెరికాను కూడా తప్పుపట్టింది.
యుద్ధ పరిస్థితులు రాకుండా చేస్తామని ఎవరు హామీ ఇవ్వలేరు. యుద్ధాన్ని ఆపాలని, సంక్షోభాన్ని అరికట్టాలనే ఆసక్తి ఉన్నవారు గాజాలో జరిగే అనాగరిక దాడులను అడ్డుకోవాలని అమెరికాను ఉద్దేశిస్తూ హోస్సేన్ పరోక్షంగా విమర్శలు చేశారు. లక్షల మంది ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఆహారం, నీరు, ఇంధనం కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. తాగడానికి మంచి నీరు, బ్రెడ్ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాయాలపాలైన వారితో ఆసుపత్రిలు నిండిపోతున్నాయి. వైద్య సామాగ్రి కొరతతో డాక్టర్లు చికిత్స చేయలేకపోతున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి వెనుక ఇరాన్ చేతులు ఉండొచ్చని మొదట అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆరోపణలను ఇరాన్ ఖండించింది.