Narendra Modi: భద్రతా వైఫల్యం వల్ల కొందరు యువకులు పార్లమెంట్‌లోకి చొరబడి గందరగోళం సృష్టించి.. అందరినీ ఆందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై తాజాగా ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. పార్లమెంట్లో యువకులు చొరబడి గందరగోళం సృష్టించడం దురదృష్టకరమైన, ఆందోళనకరమైన ఘటన అని మోదీ అభివర్ణించారు. ఇలాంటి ఘటనను ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని అన్నారు. ఘటన తీవ్రత దృష్టానే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దీనిపై సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వాటి వెనుక ఉన్న అంశాలు, ప్రణాళికలను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. వాటికి పరిష్కారం కనుగొనడం కూడా అంతే ముఖ్యమని మోదీ అన్నారు. ఈ సందర్భాల్లో ప్రతి ఒక్కరూ వివాదాలు, ప్రతిఘటనలకు దూరంగా ఉంటే బెటర్ అని పేర్కొన్నారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి జరిగింది. 22 ఏళ్ల తర్వాత సరిగ్గా అదే రోజు అంటే 2023 డిసెంబర్ 13న ఆరుగురు యువకులు పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఈ ఘటనను అంత ఈజీగా వదిలేయకూడదని పేర్కొన్నారు.