గణతంత్ర దినోత్సవ కార్యక్రమం కూడా తెలంగాణలో రాజకీయంగా మారింది. గవర్నర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అధికార పక్షంపై తీవ్రంగా స్పందించగా.. గణతంత్ర వేడుకలు రాజ్ భవన్ కే పరిమితం చేయడంపై బీజేపీ, కాంగ్రెస్ లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా ఇదే విషయమై సినీ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. కేసీఆర్ వెంటనే వీఆర్ఎస్ తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో గురువారం జరిగిన బీజేపీ సమావేశంలో ఆమె కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘అయ్యా కేసీఆర్ నీకో దండం. నీ పార్టీకో దండం. కేసీఆర్ మీరు తొందరగా వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోండి. రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు. మహిళలకు గౌరవం ఇవ్వడం లేదు. గవర్నర్ కు గౌరవం లేదు. మీ పార్టీలో ఉన్న మహిళలకు కూడా గౌరవం లేదు. మీ అంత దోపిడీ ముఖ్యమంత్రి తొందరగా వెళ్లిపోతే తెలంగాణ బాగుపడతది’ అని విజయశాంతి తెలిపారు. కాగా, జనవరి 26వ తేదీతో తాను రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిందని చెప్పారు. 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుగుతాయని విజయశాంతి పేర్కొన్నారు.