»70 66 Voting In Telangana Assembly Elections 2023 Hyderabad Voting Percentage Is Low
Telangana:లో 70.66% ఓటింగ్..హైదరాబాద్‌లో దారుణం
తెలంగాణలో 119 స్థానాలకు జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 70.66 శాతం ఓటింగ్ నమోదైనట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే వీటిలో బ్యాలెట్ ఓట్లు ఇంకా కలపలేదని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.
70.66% voting in Telangana assembly elections 2023 Hyderabad voting percentage is low
తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల(Telangana assembly elections 2023) పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. అయితే రాత్రి 12 గంటలకు వచ్చిన సమాచారం ప్రకారం సుమారుగా 70.66 శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు. పోస్టల్ బ్యాలెట్ వివరాలు ఇంకా దీనిలో చేర్చలేదని..ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. చిన్నపాటి సాంకేతిక అవాంతరాలు, పలు చోట్ల పోలింగ్ ఏజెంట్ల మధ్య వాగ్వాదం, ఇంకొన్ని చోట్ల ప్రధాన పార్టీల ఘర్షణలు మినహా పోలింగ్ సజావుగా సాగింది.
అయితే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మాత్రం చాలా దారుణంగా పోలింగ్(polling) శాతం కేవలం 46.12 మాత్రమే నమోదైంది. ఓటర్లు బూత్‌లకు రావడానికి నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఇక లెఫ్ట్ వింగ్ తీవ్రవాద (LWE) ప్రభావిత ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియగా, మిగిలిన 106 సెగ్మెంట్లలో సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటలకే పోలింగ్ బూత్‌ల వద్ద క్యూలో నిలబడిన వారిని ఓటు వేసేందుకు అనుమతించారు.
2018 నాటి 73.74 శాతం ఓటింగ్‌తో పోల్చితే, తెలంగాణాలో ఈసారి ప్రస్తుతం 70.66 శాతం తక్కువగా నమోదైంది. చివరిగా నివేదికలు వచ్చినప్పుడు సుమారుగా ఓటరుగా ఉన్న ఓటింగ్ గణాంకాల ప్రకారం అధికారిక శాతాన్ని భారత ఎన్నికల సంఘం ఆలస్యంగా ప్రకటించింది. సాయంత్రం 5 గంటల వరకు అధికారిక ముగింపు సమయానికి మెదక్ జిల్లాలో సుమారు 86.69 శాతం, జనగాంలో 85.74 శాతం, మహబూబాబాద్‌లో 83.70 శాతం, ఆదిలాబాద్‌లో 79.86 శాతం, హన్మకొండలో 66.38 శాతం, హైదరాబాద్‌లో 46.12 శాతం పోలింగ్ నమోదైంది. మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు కూడా తక్కువ శాతం 56, 59.94 శాతంగా ఓటింగ్ రికార్డైంది.
ఈసారి ఎన్నికల పోటీలో 221 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్జెండర్లు సహా 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేసి సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో ఓటు వేశారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గజ్వేల్, హుజూరాబాద్ నుంచి పోటీ చేయగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డి స్థానాల్లో పోటీ చేశారు. 2018లో BRS (అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి) 119 సీట్లలో 88 స్థానాలను గెలుచుకుంది. 47.4 శాతం ఓట్లను సాధించింది. కాంగ్రెస్ కేవలం 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈసారి మాత్రం ఇటివల ఓటింగ్ తర్వాత ప్రకటించిన సర్వేలన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలుస్తుందని వెల్లడించాయి.