»Cpi Narayana Condemns Cm Kcr Comments On Telangana Movement
KCR చావు నోట్లో తలపెట్టి రాలే.. అంతా ఫేక్: సీపీఐ నారాయణ
అందరూ కలిసి ఉద్యమిస్తేనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని సీపీఐ అగ్రనేత నారాయణ అన్నారు. కానీ తన ఒక్కడి వల్లే రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్ అంటున్నారని విమర్శించారు.
Cpi Narayana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రేపటితో తెర పడనుంది. ఇక ఉన్న రెండు రోజులను (ఇవాళ, రేపు) సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో ఆదివారం ఆయన ప్రచారం నిర్వహించారు. సీపీఐ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి కూనంనేని సాంబశివరావు కోసం క్యాంపెయిన్ చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేశారని సీపీఐ నారాయణ (Cpi Narayana) గుర్తుచేశారు. కానీ తన వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్ చెప్పుకోవడం కరెక్ట్ కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం చావు నోట్లో తలపెట్టానని చెప్పడం బూటకం అని మండిపడ్డారు. ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని తెలిపారు. దీక్ష ప్రారంభించిన కేసీఆర్.. విరమించాలని అనుకున్నారని వివరించారు. ఓయూ విద్యార్థులు ఆందోళన చేయడంతో తిరిగి ఉద్యమించారని పేర్కొన్నారు. ఆ ఘటన తర్వాత ఉస్మానియా వర్సిటీలోకి కేసీఆర్ వెళ్లలేదని చెప్పారు. ఉద్యమాన్ని నీరు గార్చొద్దనే ఉద్దేశంతో ఆ విషయాలను ఇదివరకు తాను ప్రస్తావించలేదని తెలిపారు.
కొత్తగూడెంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులపై సీపీఐ నారాయణ (Cpi Narayana) మండిపడ్డారు. అస్తమించే పార్టీ నుంచి వనమా వెంకటేశ్వరరావు బరిలో ఉన్నారని.. జలగం వెంకట్రావుకి ఓటు అడిగే అర్హత లేదన్నారు. బీజేపీలో అగ్రవర్ణాలకే పదవులు దక్కుతాయని మండిపడ్డారు. ఓ బీసీ అధ్యక్షుడిని తొలగించి.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎందుకు నియమించారని అడిగారు. 30 సీట్లు వచ్చిన సరే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎలా అంటుందని అడిగారు. దీంతో బీఆర్ఎస్ పార్టీతో రహస్య ఒప్పందం ఉందని స్ఫష్టమవుతోందని చెప్పారు.