Vijayashanthi : విజయశాంతి బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపారు. అయితే విజయశాంతి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రాహుల్ గాంధీ రేపు తెలంగాణకు రానున్నారు. ఈ తరుణంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. అలాగే… తెలంగాణ సెటిలర్స్ అనే భావన లేదంటూ విజయశాంతి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ బిడ్డలైనా తెలంగాణ ప్రజలేనని, ఆ ప్రజల ప్రయోజనాలు, భద్రత, తెలంగాణాల కాపాడబడి తీరాలన్న విధానం కచ్చితంగా సమర్ధించబడవలిసినదేనని వివరించారు. కానీ తరతరాలు పోరాడిన మా తెలంగాణ ఉద్యమకారులు ప్రాంతేతర పార్టీలను ఎన్నికల పరంగా ఆమోదించరన్నారు. అది, ఎప్పటికీ నిరూపితమైన వాస్తవం అని వివరించారు. అదే సమయంలో మరో అంశాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి. ప్రాంతేతర పార్టీలను, అక్కడి ప్రాంతం నుంచి వచ్చి.. ఇక్కడ ఉంటున్న తెలుగు బిడ్డలను ఒకే గాటన కట్టడం ఎంత మాత్రం సరికాదని ఫైర్ అయ్యారు.
కాగా, విజయశాంతి త్వరలో తమ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఇటీవల చెప్పారు. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఆయన పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల నరేంద్ర మోడీ పాల్గొన్న పరేడ్ గ్రౌండ్లో జరిగిన విశ్వరూప సభకు మాదిగల హాజరు కాలేదు. నిన్న ఫేస్ బుక్, ట్విటర్ ప్రొఫైల్ పిక్ మార్చారు.