లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతిచెందిన సంఘటన హైదరాబాద్ లోని ఎల్బీ నగర్లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అపార్ట్మెంట్ లోని లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతిచెందిన సంఘటన హైదరాబాద్ లోని ఎల్బీనగర్లో చోటుచేసుకుంది. ఆర్టీసీ కాలనీలో ఉప్పలాస్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌ను నిర్మించారు. ఆ అపార్ట్‌మెంట్‌కు నాగరాజు అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. నాగరాజు, అనురాధ దంపతులకు అక్షయ్ అనే నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. అక్షయ్ అపార్ట్మెంట్ వద్దకు వెళ్లి ఆడుకుంటూ ఉండగా లిఫ్ట్ దగ్గరికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ ఆ బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కున్నాడు.
ఈ క్రమంలో అక్షయ్ అరుపులు విన్న తల్లిదండ్రులు అక్కడికి పరుగెత్తుకుని వెళ్లారు. లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఈ బాలుడ్ని బయటకు తీశారు. వెంటనే అక్షయ్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించాడు. 20 రోజులకు ముందే నాగరాజు వాచ్‌మెన్‌గా పనిలోకి చేరాడు. ఈ మధ్యే లిఫ్ట్ కూడా పనిచేయకుండా ట్రబుల్ ఇవ్వడంతో అక్కడే తన కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని నింపింది. కుమారుడు కళ్ల ముందే విగతజీవిగా మారాడని తెలియడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు.
బాలుని మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడి మృతదేహాన్ని కనీసం తమ తల్లిదండ్రులకు కూడా చూపించకుండానే పోస్టుమార్టం చేయడంపై తల్లిదండ్రులు ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆస్పత్రి వద్ద కొంత ఆందోళన నెలకొంది. బాలుడి మరణ వార్త ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.