»Womens Morphing Videos For Rs 50 Young Man Arrested In Hyderabad
Cyber Crime: రూ.50కు మహిళల మార్ఫింగ్ వీడియోలు..హైదరాబాద్‌లో యువకుడు అరెస్ట్
ఓ వ్యక్తి ఈజీ మనీ కోసం అమ్మాయిల ఫోటోలతో మార్ఫింగ్ వీడియోలు చేసి అమ్మడం మొదలు పెట్టాడు. ఆ వీడియోలను ట్విట్టర్లో 50 రూపాయలకే అమ్ముతుండటాన్ని సైబర్ పోలీసులు గుర్తించారు. చాకచక్యంగా ఆ వ్యక్తిని సైబర్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
నేటి రోజుల్లో ఈజీమనీ (Easy Money) కోసం కేటుగాళ్లు అనేక పద్దతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. సోషల్ మీడియా (Social Media)ను వినియోగించుకుని రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో విచ్చలవిడిగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. అందులోనూ ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు మహిళలను టార్గెట్ చేయడం ఎక్కువైంది. తాజాగా ఓ యువకుడు మహిళల మార్ఫింగ్ కంటెంట్‌ను ట్విట్టర్ (ఎక్స్)లో విక్రయిస్తూ జేబును నింపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber Crime Police) ఆ వ్యక్తిపై ఫోకస్ చేసి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
భూక్య రమేష్ అనే వ్యక్తి మహిళల మార్ఫింగ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ (Viral) చేసేవాడు. ట్విట్టర్ హ్యాండిల్లో అసభ్యకరంగా వీడియోలను షేర్ చేసేవాడు. ఒక్కో మార్ఫింగ్ వీడియో (Morphing Video)ను రూ.50లకు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. దీనిని సైబర్ క్రైమ్ పోలీసులు తెలుసుకున్నారు. ఫుల్ వీడియో కావాలంటే ఒక నంబర్‌కు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలని, నెటిజన్లను నమ్మించాడు. దీంతో చాలా మంది రమేష్ అకౌంట్లో డబ్బులు వేశారు.
ఈ తతంగాన్ని చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి భూక్య రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. మహిళలపై అసభ్యకరమైన మార్ఫింగ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని మరికొందరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద భూక్య రమేష్‌పై కేసు నమోదు చేశారు.
మహిళలు తమ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా జాగ్రత్తపడాలని సైబర్ పోలీసులు హెచ్చరించారు. ఈమధ్య కాలంలో ఇటువంటి కేసులు ఎక్కువయ్యాయని, దీని వల్ల పలువురు లేనిపోని చిక్కులు కొని తెచ్చుకునే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. మహిళల మార్ఫింగ్ వీడియోలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు.