ఉప్పల్ స్టేడియంలో సామగ్రి కొనుగోళ్ల అవకతవకలపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin)పై ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో మూడు, మాజీ కార్యదర్శి విజయానంద్, మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్‌పై రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి.హెచ్‌సీఏ (HCA) అధ్యక్షుడిగా అజారుద్దీన్ పని చేసిన 2019-2022 సమయంలో అగ్నిమాపక పరికరాలు, క్రికెట్ బంతులు, బకెట్ కుర్చీలు, జిమ్ సామాగ్రి (Gym equipment) వంటి అనేక పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుందని హెచ్‌సీఏ అధికారులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీసులు అక్రమాలను నిర్ధారించి అజారుద్దీన్ పై ఐపీసీ సెక్షన్లు 406, 409, 420, 465, 467, 471, 120(బీ) కింద కేసులు నమోదు చేశారు.ఈ అవకతవకలతో సంబంధం ఉన్న ఫైర్ విన్ సేఫ్టీ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్, సారా స్పోర్ట్స్, బాడీ డ్రెంచ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎక్సలెంట్ ఎంటర్ప్రైజెస్ తదితర నాలుగు సంస్థల పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు.
అగ్నిమాపక సామగ్రి కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, అప్పట్లో న్యాయస్థానం నియమించిన జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ (Ahmed Kakru) పర్యవేక్షక కమిటీ దృష్టికి రాకుండానే కాంట్రాక్టు ఇచ్చారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బంతుల కొనుగోళ్లకు సంబంధించి హెచ్‌సీఏకు రూ.57.07 లక్షల నష్టం వాటిల్లినట్లు, జిమ్‌కు సంబంధించి ట్రెడ్మిల్, ఇతర సామగ్రి నాసిరకంగా ఉన్నట్లు పొందుపరిచారు. బకెట్ కుర్చీల కొనుగోళ్లలో ధరల పెంపుతో రూ.43.11 లక్షల నష్టం వాటిల్లిందని ప్రస్తావించారు.అజారుద్దీన్‌కు రాబోయే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చేందుకు మొండిచెయ్యి చూపిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ అసెంబ్లీ బరిలోకిదిగే అభ్యర్థుల మొదటి జాబితా కాంగ్రెస్ పార్టీ(Congress party) ప్రకటించినప్పటికీ అందులో జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించకపోవడం పలు అనుమానాలకు దారితీసింది. అయితే ఉప్పల్ పీఎస్ పరిధిలో ఆయనపై నమోదైన కేసులు పార్టీకి మచ్చతెచ్చేలా ఉండడంతో అజారుద్దీన్‌కు మొండిచెయ్యి చూపినట్లుగా తెలిసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం (Jubilee Hills Constituency) నుంచి ఎన్నికల బరిలోకి దిగేందుకు విష్ణువర్ధన్‌రెడ్డి సన్నాహాలు చేసుకుంటున్నారు.