ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర శనివారం అర్దరాత్రి ప్రారంభం కానుంది. ప్రతి యేటా ఫుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజలతో జాతర ప్రారంభమవుతుంది. కాగా, ఈ వేడుకకు మెస్రం వంశీయులతో పాటు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలోని కలమడుగుకు కాలినడకన వెళ్లి గోదావరి పవిత్ర జలాలను తీసుకొచ్చారు. ఈ జలాలతో అభిషేకం చేసిన అనంతరం జాతర ప్రారంభమవుతుంది. అధికారికంగా ఐదు రోజులపాటు కొనసాగుతుంది.
రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, బిహార్, ఏపీ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. విదేశాల నుంచి పర్యాటకులు, సందర్శకులు తరలిరానున్నారు. శనివారం సాయంత్రం ఎడ్లబండ్లతో గోవాడ్కు మెస్రం వంశీయులు చేరుకుంటారు. రాత్రి నాగోబా ఆలయాన్ని పవిత్ర గంగాజలంతో శుద్ధి చేసి నాగోబాకు అభిషేకం చేసి నైవేద్యాన్ని సమర్పించి మహాపూజలు నిర్వహిస్తారు.