Ysrtp Contest In Telangana Polls: తెలంగాణ రాష్ట్రంలో పొత్తు లేదని వైఎస్ఆర్ టీపీ (Ysrtp) స్పష్టంచేసింది. ఒంటరిగానే బరిలోకి దిగుతామని తేల్చిచెప్పింది. తమ పార్టీ 119 నియోజక వర్గాల్లో పోటీ చేస్తుందని షర్మిల ప్రకటించారు. పాలేరు నుంచి పోటీ చేస్తానని తెలిపారు. రెండో చోటు నుంచి పోటీ చేయాలని కోరుతున్నారని.. పరిశీలిస్తున్నానని వివరించారు. తన భర్త బ్రదర్ అనిల్ కుమార్, తల్లి విజయమ్మ పోటీకి దింపాలని అడుగుతున్నారని.. ఆ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని వివరించారు.
తమ పార్టీ నుంచి పోటీ చేయాలని అనుకునే వారు బి ఫామ్ల కోసం ధరఖాస్తు చేసుకోవాలని షర్మిల కోరారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తే ప్రజా వ్యతిరేక ఓటు చీలదు అనుకున్నామని తెలిపారు. ప్రజా వ్యతిరేక ఓటు చీల్చిన అపఖ్యాతి వస్తుందని అనుకున్నామని.. అందుకే వెనక్కి తగ్గామని చెప్పారు. ఓట్లు చీలిస్తే కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడని అనుకున్నామని..అందుకే కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపామని వివరించారు. గత 4 నెలల నుంచి ఎదురు చూశాం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మళ్ళీ వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకు వస్తామని షర్మిల అంటున్నారు.