క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే తరుణం రానుంది. భారత్, పాక్ మ్యాచ్ త్వరలోనే జరగనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ప్రతి టోర్నమెంట్ లో ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడేందుకు ఐసీసీ అన్నీ ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. 2024లో కూడా టీ20 ప్రపంచ కప్ లో తలపడేందుకు ఈ జట్లకు రూట్ క్లియర్ అయ్యింది. ఆ ప్రపంచకప్ ను వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుండగా భారత్, పాక్ మ్యాచ్ మాత్రం అమెరికాలో జరగనున్నట్లు అమెరికా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అతుల్ రాయ్ వెల్లడించారు.
ఫ్లోరిడాలో జరిగిన భారత్, వెస్టిండీస్ మ్యాచ్ కు అద్భుతమైన స్పందన వచ్చిందని, ఆ మ్యాచ్ కు సంబంధించిన టిక్కెట్లన్నీ అమ్ముడైనట్లు ఆయన తెలిపారు. అమెరికాలో భారత్, పాక్ మ్యాచ్ నిర్వహించడానికి ఒక కారణం ఉంది. అమెరికాలో క్రికెట్ కు ప్రాచుర్యం కల్పించేందుకు ఐసీసీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అక్కడ బేస్ బాల్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ క్రీడలకు ఎక్కువ ఆదరణ ఉంది. క్రికెట్ కు కూడా అటువంటి ఆదరణ లభించడానికి ఐసీసీ ప్రయత్నాలు చేస్తోంది.