»Jammu Kashmir Police Seized Cocaine Of Worth Rupees 300 Crore 2 People Arrested
Jammu Kashmir : జమ్మూలో ఉగ్రవాదుల భారీ కుట్ర.. రూ. 300 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించిన ఉగ్రవాద (నార్కో-టెర్రర్) కుట్రను పోలీసులు ఛేదించారు. వాహనం నుండి 30 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించిన ఉగ్రవాద (నార్కో-టెర్రర్) కుట్రను పోలీసులు ఛేదించారు. వాహనం నుండి 30 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ అయిన కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.300 కోట్లు. సీనియర్ పోలీసు అధికారి ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బనిహాల్ ప్రాంతంలో కొకైన్ స్వాధీనం చేసుకున్న తర్వాత పంజాబ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
జమ్మూ రీజియన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ మాట్లాడుతూ.. శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోహితా శర్మ నేతృత్వంలో రాంబన్ పోలీసులు బనిహాల్ రైల్వే చౌక్ సమీపంలో కాశ్మీర్ నుంచి జమ్మూకు వస్తున్న వాహనాన్ని ఆపి, అందులో నుంచి 30 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామని, అంతర్జాతీయ మార్కెట్లో పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 300 కోట్లని తెలిపారు. దీనికి సంబంధించి ఇద్దరిని కూడా అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు.
కొకైన్‌ను విజయవంతంగా స్వాధీనం చేసుకోవడంతో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన ప్రధాన ఉగ్రవాద కుట్రను ఛేదించినట్లు అధికారి తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్‌లోని సంబంధిత సెక్షన్ల కింద బనిహాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సింగ్ తెలిపారు. అరెస్టు చేసిన స్మగ్లర్లను పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన సరబ్జిత్ సింగ్, ఫగ్వారాకు చెందిన హనీ బస్రాగా గుర్తించినట్లు బనిహాల్ పోలీస్ స్టేషన్ హెడ్ మహ్మద్ అఫ్జల్ వానీ తెలిపారు. వాహనం పైకప్పుపై మూడు కిలోల కొకైన్‌ను దాచి ఉంచగా, వారి లగేజీ నుంచి 27 కిలోల డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్మగ్లర్లను ఆపమని సూచించడంతో వారు పారిపోయేందుకు ప్రయత్నించారని, అయితే వెంబడించి అరెస్టు చేశారని వానీ చెప్పారు. సరిహద్దుల నుంచి కొకైన్‌ను స్మగ్లింగ్ చేసి ఉత్తర కాశ్మీర్ నుంచి పంజాబ్‌కు తరలిస్తున్నట్లు అధికారి తెలిపారు.