CM KCR: 12.30 లక్షల ఎకరాలకు సాగు, 1200 పైచిలుకు గ్రామాలకు తాగునీరు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రారంభించారు. దీంతో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1200 పై చిలుకు గ్రామాలకు తాగునీరు అందింది.
Palamuru Rangareddy lift irrigation scheme: తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో (Palamuru Rangareddy lift irrigation scheme) మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండలో గల 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందిస్తారు. 1200 గ్రామాలకు పైగా తాగునీరు అందజేస్తారు. పరిశ్రమలకు 0.33 టీఎంసీల నీటిని వినియోగిస్తారు. ప్రాజెక్టును రెండు దశలుగా చేపట్టారు. తొలి విడతలో తాగునీరు, రెండో దశలో సాగునీరుకు సంబంధించిన పనులు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.35 వేల కోట్ల వరకు ఖర్చు చేసింది. నార్లాపూర్ వద్ద తొలి పంపు స్విచ్ ఆన్ చేసి.. ఎత్తిపోతల పథకం పైలాన్‌ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
145 మెగావాట్ల మోటార్లు
శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రోజు 2 టీఎంసీల నీరు లిప్ట్ చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మాదిరిగానే 145 మెగావాట్ల కెపాసిటీ కలిగిన మోటార్లను ఏర్పాటు చేశారు. తొలుత 915 కిలోమీటర్ల ప్రాథమిక కాల్వను నిర్మించారు. రోజు 3200 క్యూసెక్కులు ఎత్తి పోయగల కెపాసిటీ గల పంపు ద్వారా 2 టీఎంసీల నీటిని అంజనగిరి జలాశయానికి తరలించి నిల్వ చేస్తారు. తాగునీటికి సంబంధించిన పనులను నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 21 ప్యాకేజీలుగా విభజించారు. కేపీ లక్ష్మీదేవిపల్లి మినహా 18 ప్యాకేజీల పనులను ప్రభుత్వం చేపట్టింది. శ్రీశైలం జలాశయం నుంచి అప్రోజ్ కాల్వ ద్వారా నార్లాపూర్ ఇన్ టేక్ వెల్‌కు చేరుకునే కృష్ణా జలాలను స్విచ్ నొక్కడంతో 104 మీటర్లు పైకి ఎత్తి సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌లో పోసింది. నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద కృష్ణా జలాలకు సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లిఫ్ట్‌లో కంట్రోల్ రూమ్‌కు చేరుకుని.. మహాబాహుబలి మోటార్లను ఆన్ చేశారు. అక్కడ సర్జ్ పూల్, పంప్ హౌస్‌ను పరిశీలించారు. అక్కడినుంచి నార్లాపూర్ చేరుకున్నారు. రిజర్వాయర్ వద్ద డెలివరీ సిస్టర్న్స్ నుంచి వచ్చే జలాలకు పూజలు చేసి.. పుష్పాభిషేకం చేశారు.
400/11 కేవీ సబ్ స్టేషన్లు
ఒక్కో మోటార్ సామర్థ్యం 145 మెగావాట్లు కాగా.. ఇలాంటివి 34 ఉన్నాయి. రోజు 2 టీఎంసీల చొప్పున 60 రోజులు 120 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తాయి. ప్రాజెక్ట్ కోసం 4 చోట్ల 400/11 కేవీ సబ్ స్టేషన్లను నిర్మించారు. నార్లాపూర్ పంప్ హౌస్ వద్ద ఒకటి.. ఏదుల, పట్టెం, ఉద్దండాపూర్‌లో నిర్మించారు. ఒక్కో సబ్ స్టేషన్ కోసం 50 ఎకరాల స్థలం ఉపయోగించారు. ఒక్కొదానిని కలుపుతూ.. విద్యుత్ అందించేందుకు డిండి, వెల్టూర్, మహేశ్వరం నుంచి 400 కేవీ లైన్లను నిర్మించారు. 320 కిలోమీటర్లు పొడవైన 400 క్యూఎండీసీ లైన్లను ఏర్పాటు చేశారు. ఎత్తిపోతల పథకం కోసం ట్రాన్స్ కో అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు సిబ్బంది శ్రమించారు. ప్రాజెక్ట్ కోసం ట్రాన్స్ కో రూ.2155.17 కోట్లు ఖర్చు చేసింది. ఫేజ్-1లో రూ.1511.17 కోట్లు వ్యయం చేయగా.. ఫేజ్-2లో రూ.644 కోట్లు ఖర్చు చేసింది. ఇలా ఎత్తి పోతల పథకానికి విద్యుత్ సరఫరా చేసి.. నీరు ఎత్తి పోసేందుకు కారణం అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బాహుబలి మోటార్లు ఉండగా.. ఎత్తిపోతల పథకంలో అంతకుమించి అనేలా ఉన్నాయి. దీంతో పాలమూరు అన్నదాతల కష్టం తీరినట్టైంది. ఆ జిల్లాలో ఇక వలసలకు ఆస్కారం ఉండదు.
Palamuru-Ranga Reddy project was launched by CM KCR