స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టైన సంగతి తెలిసిందే. అరెస్ట్ గురించి ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. దీంతో నందమూరి- నారా ఫ్యామిలీల మధ్య ఏం జరిగిందనే చర్చ జరుగుతోంది.
Jr NTR: చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. అక్రమం, అన్యాయం అంటూ గొంతెత్తి నినాదిస్తున్నాయి. దీనికి వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. లక్ష్మీ పార్వతీ అయితే ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. లోకేశ్, బ్రహ్మణి తదితరులు జైలుకు వెళ్లి కలుస్తున్నారు. చంద్రబాబు బావమరిది బాలకృష్ణ కూడా మాట్లాడారు. కానీ జూనియర్ ఎన్టీఆర్, ఆయనతోపాటు కల్యాణ్ రామ్ మౌనం వహించారు. చంద్రబాబు అరెస్ట్‌పై రచ్చ జరుగుతుంటే.. వీరిద్దరూ మాత్రం నోరు తెరవడం లేదు. దీంతో ఏం జరుగుతోంది..? వీరి మౌనంలో ఆంతర్యం ఏంటీ..? కోర్టు పరిధిలో ఉండటంతో మాట్లాడటం లేదా..? లేదంటే ఇతర కారణాలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
దూరం దూరం
గత కొంతకాలం నుంచి టీడీపీ, చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంలో కూడా అలానే వ్యవహారించారు. పార్టీలో నారా లోకేశ్‌కు ప్రయారిటీ ఇస్తున్నారని.. తారక్ అనుకుంటున్నారని రాజకీయ విశ్లేషకుల భావన. అందుకే దూరంగా ఉంటున్నారని తెలిసింది. గత ఎన్నికల్లో క్యాంపెయిన్ చేయకపోవడానికి కూడా ఇదే కారణం అని సమాచారం. 2009 ఎన్నికల్లో మాత్రం.. తన తాత ఎన్టీఆర్ మాదిరిగా ఖాకీ షర్ట్, ఖాకీ ఫ్యాంట్ వేసుకొని మరీ ప్రచారం చేశారు. ఆ సమయంలో కారు యాక్సిడెంట్ కావడం.. తర్వాత క్రమంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇదివరకు మూవీ ప్రీ రిలీజ్ వేడుకల మీద, సినిమాల్లో రాజకీయాల గురించి డైలాగులు ఉండేవి. ఆ తర్వాత పరిస్థితి మారింది. కొత్త పంథాలో వెళుతూ.. రాజకీయాల ప్రస్తావన లేకుండా వెళుతున్నారు.
లోకేశ్‌కు పగ్గాలు..?
చంద్రబాబు.. తర్వాత లోకేశ్‌కు పగ్గాలు అప్పగిస్తారని పార్టీలో ఇంటర్నల్‌గా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల తర్వాత ఆ అంశంపై ప్రకటన ఉండనుందని టీడీపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సో.. అందుకే ఎన్టీఆర్ దూరంగా ఉన్నారని మరికొందరి ఆనలిస్టుల భావన. లేదు.. కేసు కోర్టు పరిధిలో ఉండగా.. మాట్లాడటం భావ్యం కాదని మరికొందరు విశ్లేషిస్తున్నారు. లేదంటే స్పందించే వారని కవరింగ్ చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత పార్టీ చంద్రబాబు కబంధహస్తాల్లోకి వెళ్లిపోయింది. కొన్నాళ్లు నందమూరి- నారా ఫ్యామిలీస్ దూరంగా ఉన్నాయి. చంద్రబాబు కుమారుడు లోకేశ్‌తో బాలకృష్ణ కూతురు బ్రహ్మణికి పెళ్లి జరగడంతో మళ్లీ దగ్గరయ్యారు. వేరే పార్టీలో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఇటీవల జరిగిన ఎన్టీఆర్ స్మారక నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. చంద్రబాబును వ్యతిరేకిస్తోన్న లక్ష్మీ పార్వతి.. తన కుమారుడు రాజకీయ ఎదుగుదలకు పోటీ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఎదగనివ్వడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు మనస్తత్వం తెలిసి.. తారక్ దూరంగా ఉంటున్నారని అభిప్రాయ పడుతున్నారు.
మౌనంగా తారక్
మామ అరెస్ట్ అయ్యాక తారక్ మాట్లాడకపోవడం చర్చకు దారితీసింది. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు..? కనీసం ట్వీట్ చేస్తే బాగుండేదని అతని సన్నిహితులు అంటున్నారు. టీడీపీ కాకుండా వేరే పార్టీలోకి తారక్ వెళ్లే అవకాశం లేదు. అతని స్నేహితులు కొడాలి నాని, వంశీ మాత్రం వైసీపీలో ఉన్నారు. వంగవీటి రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే.. ఆయనకు మంచి పదవీ ఇస్తే.. వీరంతా తిరిగి సైకిల్ పార్టీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అదీ అనుకున్నంత ఈజీ కాదు, కాబోదని మరికొందరు ఆనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. బాబు అరెస్ట్ గురించి నేతలు అందరూ స్పందించారు. తారక్ సైలంట్‌గా ఉండటం వెనక ఏదో బలమైన కారణం ఉండొచ్చని.. అందుకే మౌనం వీడటం లేదని అతని సన్నిహితులు చెబుతున్నారు. ఈ అంశం కూడా సినీ, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.