వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధమని ప్రముఖ సినీ నటుడు, ఆ పార్టీ నేత అలీ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు పవన్ పైన పోటీ చేస్తారా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. నవ్వుతూ… అది జగన్ అభిప్రాయం, మా ముఖ్యమంత్రి ఇక్కడి నుండి పోటీ చెయ్ అలీ అంటే నేను రెడీ అన్నారు. పవన్ తనకు మంచి మిత్రుడేనని, అయితే సినిమాలు వేరు, రాజకీయాలు వేరు, స్నేహం వేరు అనే విషయం గుర్తుంచుకోవాలని అభిప్రాయపడ్డారు. అధిష్టానం ఆదేశిస్తే తాను ఎక్కడి నుండి అయినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లు గెలవడం ఖాయమని చెప్పారు. పవన్ కళ్యాణ్‌పై వైసీపీకి చెందిన పలువురు నేతలు ఇష్టారీతిన మాట్లాడటంపై కూడా అలీ స్పందించారు. రాజకీయాల్లో విమర్శలకు ప్రతివిమర్శలు ఉండటం సహజమే అన్నారు. రోజా ఫైర్ బ్రాండ్ అని, ఆమె ఎక్కడా తగ్గదని చెప్పారు. మెగా కుటుంబంతో రోజాకు సత్సంబంధాలే ఉన్నాయని వెల్లడించారు. రోజాను డైమండ్ రాణీతో పోల్చడం అంటే విలువైనదిగా పోల్చడమే అన్నారు. డైమండ్ కాస్ట్లీ అని తెలుసుకోవాలన్నారు. ఆమె కూడా ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా ఉంటున్నారన్నారు. రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తారో ప్రజలకు తెలుసునన్నారు. జగన్ ప్రభుత్వంలో అందరూ సంతృప్తిగా ఉన్నారని చెప్పారు.
అలీకి పవన్ కళ్యాణ్ మంచి స్నేహితుడు అనే విషయం తెలిసిందే. దీంతో 2019 ఎన్నికలకు ముందు ఆయన జనసేన పార్టీలో చేరుతారని చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నాలుగు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్‌గా అపాయింట్ అయ్యారు. 1999లో మురళీ మోహన్ ఆయనకు టీడీపీ సభ్యత్వం ఇప్పించారు. అప్పుడు ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు.