లడఖ్ (Ladakh)లో దారుణం జరిగింది. ఆర్మీ (Army) జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడటంతో తొమ్మిది మంది జవాన్లు (9 Jawans died) వీరమరణం చెందారు. స్పాట్ లోనే ఏడుగురు మరణించారు. ఆర్మీ సైనికులంతా కరూ దండు నుంచి లేహ్ సమీపంలోని క్యారీకి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మరికొంత మంది సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు జవాన్లు (Jawans) ప్రాణాలు కోల్పోయినట్లుగా భారత రక్షణ శాఖ వెల్లడించింది. క్యారీ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం నేపథ్యంలో భారత రక్షణ శాఖ (Ministry Of Defence) ప్రకటన విడుదల చేసింది.
మృతి చెందిన వారిలో ఎనిమిది మంది సైనికులు ఉండగా ఓ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్క కరూ ప్రాంతం నుంచి గ్యారీసన్ వెళ్లింది. అక్కడి నుంచి లేహ్ సమీపంలోకి క్యారీకి వెళ్తున్న సమయంలో లోయలోకి పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ వాహనంలో 34 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు.