బీజేపీలోకి వెళ్లే నాయకులు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లేనని బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోను తమ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగంలో వృద్ధి సాధించిందన్నారు. ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ సన్నాహక సభలో మాట్లాడారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ను వీడి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బీజేపీకి ఉమ్మడి ఖమ్మంలో డిపాజిట్లు కూడా రావన్నారు. దేశ రాజకీయాలను మలుపు తిప్పే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఖమ్మం వేదిక కావడం అంటే గర్వపడాల్సిన విషయమన్నారు. తెలుగు ప్రజలకు హరీష్ రావు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత కొద్ది రోజులుగా పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే అధిష్టానానికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఆయన బీజేపీ నేతల నుండి హామీ తీసుకున్నారని, త్వరలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చాయి. పొంగులేటి దారిలోనే మరికొందరు నడిచే అవకాశముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.