I just met god: Rajamouli after meeting with Steven Spielberg
దేవుడ్ని కలిశా: స్పీల్‌బర్గ్‌తో రాజమౌళి ఆనందం
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ స్టీవెన్ స్పీల్బర్గ్ను కలిశారు. ఆస్కార్ ఓటింగ్‌లో భాగంగా లాస్ ఏంజెల్స్‌లో నిర్వహించిన యూనివర్సల్ పార్టీలో స్పీల్‌బర్గ్‌తో కలిసి ఫోటోలు దిగి, వాటిని సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాదు, ఇప్పుడే నేను దేవుడిని కలిశానని పేర్కొన్నారు. సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి కూడా స్పీల్‌బర్గ్‌తో కలిసి దిగిన ఫోటోలో ఉన్నారు. నాటు నాటు పాట తనకు ఎంతో నచ్చిందని ఈ హాలీవుడ్ దర్శకుడు చెప్పిన మాటలను ఇంకా నమ్మలేకపోతున్నానని కీరవాణి ట్వీట్ చేశారు.
రాజమౌళి ట్వీట్ చేసిన కొద్ది గంటల్లోనే పెద్ద ఎత్తున లైక్స్, షేర్లు కనిపించాయి. ఈ ట్వీట్‌కు టాలీవుడ్ కథానాయకుడు నానితో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా, నిరుపమ కొట్రు తదితరులు స్పందించారు. నేను నాటు నాటు పాటను బాగా ఎంజాయ్ చేశానని స్టీవెన్ స్పీల్బర్గ్ చెబుతుంటే, రాజమౌళి ఎంజాయ్ చేసినట్లుగా ఫస్ట్ ఫోటో ఉన్నదని నిరుపమ కొట్రు పేర్కొన్నారు.
రాజమౌళి దర్శకుడిగా, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎన్నో పురస్కారాలు లభించాయి. తాజాగా గోల్డెన్ పురస్కారాలలో భాగంగా సినిమాలోని నాటు నాటు పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం విశేషం. ఈ క్రమంలో 95వ అకాడమీ అవార్డుల కోసం ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో భాగంగా నాటు నాటు షార్ట్ లిస్టయింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న చాలా సినిమాలు ఆస్కార్‌ను సొంతం చేసుకున్నాయి. జనవరి 24న ఆస్కార్ అవార్డు జాబితాను ప్రకటిస్తారు.