పార్టీ ఫిరాయింపుల అంశంపై కాంగ్రెస్ పార్టీ కదం తొక్కింది. ఈ అంశంపై సీఎస్‌కు ఫిర్యాదు చేసేందుకు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో బృందం ప్రయత్నించింది. అపాయింట్ మెంట్ లభించకపోవడంతో డీజీపీతో సమావేశం అయ్యారు. దీంతోపాటు నాగర్ కర్నూల్ పర్యటనలో జరిగిన దాడిని గురించి డీజీపీ అంజనీకుమార్‌కు వివరించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని.. తమ శ్రేణులపై దాడి చేసి, తిరిగి వారిపైనే కేసులు పెట్టారని ఫైరయ్యారు. ఇదీ మంచి పద్దతి కాదని హితవు పలికారు. ప్రతిపక్ష నేతలను కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, టీఆర్ఎస్ పార్టీలో చేరిన 12 మంది ఎమ్మెల్యేల గురించి డీజీపీకి రేవంత్ రెడ్డి కంప్లైంట్ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. డీజీపీకి అందజేసిన ఆధారాలను సీబీఐకి పంపించాలని రిక్వెస్ట్ చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమకు సీఎస్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం ఉద్దేశపూర్వకంగా జరుగుతుందని సందేహాం వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యేలకు మద్దతు చెబుతున్నారా అని సూటిగా ప్రశ్నించారు. ఆ 12 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సంక్రాంతి పండగ తర్వాత నిరసన కార్యక్రమాలు చేపడుతామని స్పష్టంచేశారు.
నాగర్ కర్నూలులో ప్రాజెక్టు శిలాఫలకాన్ని సందర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలపై దాడులకు దిగారని రేవంత్ రెడ్డి వివరించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ప్రాజెక్టులు, ఇన్నేళ్లు గడిచినా ముందుకు కదలడం లేదని విమర్శించారు. ప్రాజెక్టు శిలాఫలకాన్ని సందర్శించి, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి పర్యటించారని తెలిపారు. వారిని టీఆర్ఎస్ నేతలు దూషించడమే కాకుండా, ఆ ప్రాంత ప్రజలపై దాడులు చేశారని ఆరోపించారు. ఒకరి గొంతు మీద కాలేసి తొక్కారని, మరొకరిని కొట్టారని మండిపడ్డారు. బాధితుల్లో ఒకరు గిరిజనుడు అని, మరొకరు దళితుడు అని వెల్లడించారు. మహిళా సర్పంచిని అవమానించారని ఉల్టా నాగం జనార్థన్ రెడ్డిపై కేసు పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ బరితెగింపు చర్యకు ఇది నిదర్శనం అని రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. నాగర్ కర్నూలులో దాడులకు నిరసనగా 17వ తేదీన దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామని స్పష్టంచేశారు. ఇదే అంశాన్ని స్పీకర్‌కు కూడా తెలియజేస్తామని తెలిపారు. సభలో కూడా తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టంచేశారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత యాక్టివ్ అయ్యింది. కమిటీలను ప్రకటించి, ప్రజా సమస్యలపై జనంలోకి వెళుతుంది. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంది. జనాలను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఎక్కడ తప్పు జరిగినా సరే, అక్కడ వాలిపోయే జనాలకు తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. నాగర్ కర్నూల్ వెళ్లగా.. కాంగ్రెస్ శ్రేణులపై కూడా దాడి జరిగింది. ఇదే విషయాన్ని డీజీపీని కలిసి మరీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పనిలో పనిగా ఫిరాయింపుల గురించి కూడా కంప్లైంట్ చేశారు.