Capital expenditure:లో డేంజర్ జోన్లో ఏపీ..ఇక తెలంగాణ
మూలధన వ్యయం ఖర్చు చేయడంలో ఏపీ చివరి స్థానంలో నిలిచింది. 25 రాష్ట్రాలతో కూడిన జాబితాను బ్యాంక్ ఆఫ్ బరోడా రిలీజ్ చేసింది. ఆ నివేదికలో ఏపీ లాస్ట్ ప్లేస్లో ఉంది.
Andhra Pradesh: మూలధన వ్యయంలో (Capital expenditure) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అట్టడుగు స్థానంలో నిలిచింది. 25 రాష్ట్రాల మూలధన వ్యయాలను పరిశీలిస్తే ఏపీ చివరి స్థానంలో ఉంది. చిన్న రాష్ట్రాలైన నాగాలాండ్, అసోం, త్రిపుర కన్నా కూడా ఏపీ వెనకబడి ఉంది. నాగాలాండ్ మూలధన వ్యయం రూ.7936 కోట్లు కాగా.. ఏపీ క్యాపిటల్ ఎక్స్పెడించర్ కేవలం రూ.6917 కోట్లు మాత్రమే. 2022-23 బడ్జెట్ కేటాయింపుల్లో చాలా రాష్ట్రాల్లో 50 శాతం.. అంతకన్నా ఎక్కువగా మూలధన వ్యయం కింద ఖర్చు చేశాయి. ఏపీ కేవలం 23 శాతం మాత్రమే వ్యయం చేసిందని బ్యాంక్ ఆఫ్ బరోడా తన నివేదికలో వెల్లడించింది. అప్పులు చేస్తూ.. ఖర్చు చేస్తోన్న ప్రభుత్వం.. సంపద సృష్టిపై మాత్రం నిర్లక్ష్యంగా ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
నివేదిక ప్రకారం
బ్యాంక్ ఆఫ్ బరోడా (bank of baroda) నివేదిక ప్రకారం కర్ణాటక, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు బడ్జెట్ కన్నా అధికంగా మూలధన కేటాయింపుల కోసం వ్యయం చేశాయి. 8 రాష్ట్రాలు 70 శాతానికి పైగా కేటాయింపులు చేయగా.. 9 రాష్ట్రాలు 50 శాతానికిపైగా ఖర్చు చేశాయి. గత ఏడాది కర్ణాటక మూలధన వ్యయం కింద రూ.56,907 కోట్లు ఖర్చు చేయగా, తమిళనాడు రూ.38,732 కోట్లు, తెలంగాణ రూ.17,336 కోట్లు(20వ స్థానం), కేరళ రూ.13.407 కోట్లు, ఒడిశా రూ.33,462 కోట్లు ఖర్చు చేశాయి. ఏపీ మాత్రం రూ.6917 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 2018-19లో ఏపీ మూలధన వ్యయం రూ.19,856 కోట్లుగా ఉంది. అప్పటి బడ్జెట్లో ఇది 70.72 శాతం.. 2019-20లో 37.90 శాతం.. 2020-21లో 63 శాతం, 2021-22లో 52 శాతం కింద వ్యయం చేశారు. గత ఏడాది మాత్రం భారీగా తగ్గిపోయింది.
మూలధన వ్యయం అంటే..?
ప్రాజెక్టుల నిర్మాణం, రహదారులు, భవనాలు, ఆరోగ్య సౌకర్యం, విద్యరంగంపై ఖర్చుచేసే మొత్తాన్ని మూలధన వ్యయంగా పరిగణిస్తారు. మూలధన వ్యయం వల్ల సంపద సృష్టి జరుగుతుంది. మూలధన వ్యయం చేయడంతో భవిష్యత్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఇప్పుడు పెట్టే వ్యయంతో ముందు ముందు ప్రజలకు ఉపాధి కలుగుతుంది. ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తే దాంతో లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించవచ్చు. పంటలు పండి, రైతులకు ఆదాయం లభిస్తోంది.