Mudragada Padmanabham Write Letter To Pawan Kalyan
Mudragada Padmanabham: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాపు నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చేసి రాజకీయంగా ఎదుగుతున్నారని ఇటీవల పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలకు ముద్రగడ పద్మనాభం లేఖ ద్వారా ఘాటుగా సమాధానం ఇచ్చారు.
‘కులాన్ని అడ్డుపెట్టుకుని నాయకుడిగా ఎదగలేదు. యువతను వాడుకొని భావోద్వేగాలు రెచ్చగొట్టలేదు. ప్రభుత్వం మారినప్పుడల్లా ఉద్యమాలు చేయలేదు. చంద్రబాబు నాయుడు ద్వారా పోయిన బీసీ రిజర్వేషన్ పునరుద్ధరిస్తానని పదే పదే చెప్పడం వల్ల రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి వచ్చిందని’ ముద్రగడ పద్మనాభం అన్నారు. ‘తనకన్న పవన్ కల్యాణ్ బలవంతుడు అని.. తాను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేదో చెప్పాలన్నారు. జగ్గంపేట సభలో రిజర్వేషన్ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని సీఎం జగన్ అన్న సమయంలో తాను ఇచ్చిన సమాధానం తెలుసుకోవాలని కోరారు. ఆ తర్వాత కాపు సామాజిక వర్గానికి రూ.20 కోట్లు ఇస్తానని అడిగితే వద్దాని చెప్పానని తెలిపారు. బీసీల నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, కాపుల నుంచి బొత్స సత్యనారాయణను సీఎం చేయాలని అడిగానని’ ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.
తాను ‘ఎవరినీ బెదిరించలేదు, బెదిరించి డబ్బులు దండుకోలేదు. ఓటమి ఎరుగను. కాపు ఉద్యమంతో ఓటమితో దగ్గరయ్యా. కులాన్ని వాడుకున్నానో లేదో ఇప్పటికైనో తెలుసుకో పవన్.. ఎమ్మెల్యేలను తిట్టేందుకు సమయం వేస్ట్ చేసుకోకండి. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడటం, ప్రత్యేక రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ సమస్యలపై పోరాటం చేయాలని 2019లో తన వద్దకు వచ్చిన రాయబారులకు సలహా ఇచ్చి పంపానని తెలిపారు. సలహా అడిగి గాలికి వదిలేశారని పేర్కొన్నారు. పవన్‌కు ప్రజలపై ప్రేమ ఉంటే తన సలహాల ఆధారంగా యుద్ధం చేయాలని కోరారు. పార్టీ ఏర్పాటు చేసి పది మంది చేత ప్రేమించబడాలి.. వీధి రౌడీ భాషలో మాట్లాడటం కరెక్ట్ కాదు. పవన్ రాజకీయ యాత్ర ప్రారంభం నుంచి కాకానాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. తండ్రి, తాతది తప్పుడు మార్గాల్లో సంపాదన అనడం తప్పు. ద్వారంపూడిపై గెలిచి తన సత్తా ఏంటో చాటాలి అని’ పవన్‌కు ముద్రగడ సూచించారు.