Telangana: కాంగ్రెస్ లోకి పొంగులేటి, జూపల్లి.. ముహూర్తం ఫిక్స్
ఎట్టకేలకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti srinivasareddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
Telangana: ఎట్టకేలకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti srinivasareddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 25 లేదా 26 తేదీల్లో ఖమ్మం(Khammam)లో జరిగే భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ(Rahul gandhi) లేదా ప్రియాంక హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సభలోనే నేతలిద్దరూ కాంగ్రెస్ పార్టీ(congress party)లో చేరనున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి, జూపల్లి, అనుచరులతో పాటు అగ్రనేతల సమక్షంలో చేతులు కలపనున్నారు.
గత కొంత కాలంగా ఈ ఇద్దరు నేతలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సీనియర్ నేతలు మంతనాలు జరుపుతున్నప్పటికీ పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలో చేరుతున్నారో క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇటీవల పొంగులేటితో కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ బృందం చర్చలు జరిపింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం సాగింది.
గత కొంత కాలంగా ఏ పార్టీలో చేరాలనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని జూపల్లి, పొంగులేటి ఇప్పుడు హస్తం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి ఇప్పటికే పలు ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలతో బీఆర్ఎస్ అసంతృప్తి నేతలను ఒక్కతాటిపైకి తీసుకురావాలనేది పొంగులేటి, జూపల్లి వ్యూహంగా తెలుస్తోంది. అయితే ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉండడం, కర్ణాటక విజయంతో రాష్ట్రంలో పుంజుకునే అవకాశం ఉండడంతో పొంగులేటి, జూపల్లి హస్తం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.