»Wholesale Inflation Was Minus 0 92 To A 34 Month Low In The India
WPI: దేశంలో 34 నెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం -0.92%
ఏప్రిల్‌లో మొత్తం ధరలలో తగ్గుదల కారణంగా దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఇండియాలో టోకు ధర బేస్ ద్రవ్యోల్బణం (WPI) మైనస్ లోకి మారిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో 1.34 శాతం నుంచి - 0.92%కి చేరుకుందని వెల్లడించింది.
టోకు ధరల సూచీ(WPI) ఆధారంగా భారతదేశంలో టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో -0.92 శాతానికి చేరుకుందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జులై 2020 తర్వాత ఇది మొదటిసారి జరిగింది. టోకు ద్రవ్యోల్బణం తగ్గడంతోపాటు ఫిబ్రవరిలో 3.85 శాతం నుంచి మార్చిలో 1.34 శాతానికి చేరుకుంది.
అక్టోబర్‌లో మొత్తం టోకు ద్రవ్యోల్బణం 8.39 శాతం వద్ద ఉండగా.. అప్పటి నుంచి తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా టోకు ధరల సూచీ (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్ వరకు వరుసగా 18 నెలల పాటు రెండంకెల స్థాయిలోనే కొనసాగింది.
అయితే ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం తగ్గడానికి ప్రధాన కారణం ఆహార వస్తువులు, తృణధాన్యాలు, గోధుమలు, కూరగాయలు, బంగాళాదుంపలు, పండ్లు, గుడ్లు మాంసం, చేపలు, ఖనిజాలు, ముడి పెట్రోలియం, సహజ వాయువు, ఉక్కు తదితర ఉత్పత్తుల రేట్ల తగ్గడమేనని పేర్కొంది. అయితే ఇదే కాలంలో ఆహారేతర వస్తువుల ధరలు (-0.66%) కూడా తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు.
మే 2022 తర్వాత RBI రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. వడ్డీ రేట్లను పెంచడం అనేది ఒక ద్రవ్య విధాన సాధనం. ఇది సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా ద్రవ్యోల్బణం రేటును కూడా కట్టడి చేయవచ్చు.