వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కూతురు అరెస్టు విషయం తెలిసి… అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించిన విజయమ్మను పోలీసులు హౌజ్ అరెస్టు చేయడం గమనార్హం.
షర్మిల బేగంపేటలోని ప్రగతిభవన్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండగా ఆమె కారును అడ్డుకున్న పోలీసులు ఒక క్రేన్ సహాయంతో ఆమె కారును ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. అక్కడ కూడా హైడ్రామా నెలకొంది. పోలీస్ స్టేషన్ దగ్గర కారు డోర్ తీయకుండా లోపల ఉండి పోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు కారు అద్దాలు పగలగొట్టి మరీ ఆమె డోర్ ఆన్ లాక్ చేసి లోపలికి తీసుకువెళ్లారు. కారులో ఉన్న అందరిని అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు.
ఆ తర్వాత షర్మిలపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు నిత్యం రద్దీగా ఉండే రోడ్డు మీద ట్రాఫిక్ అంతరాయం కలిగించినందుకు అలాగే విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు విధులకు విఘాతం కలిగించినందుకు ఐపిసి సెక్షన్లు 337, 353 కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైయస్ విజయమ్మ హుటాహుటిన అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండగా విజయమ్మను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి విజయమ్మ లోటస్ పాండ్ నివాసంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
విజయమ్మను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు బయటకు వెళ్లకుండా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ బయటకు వెళ్ళకూడదు అని చెబుతూ బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ ఆమెకు హౌస్ అరెస్ట్ చేసినట్లు నోటీసులు అందించారు. కాగా.. పోలీసులు చేసిన పనికి నిరసిస్తూ ఆమె అక్కడే దీక్ష చేపట్టడం గమనార్హం.