ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో… సీఎం జగన్ అలర్ట్ అవుతున్నారు. దీనిలో భాగంగానే…. ఆయన ముందుగానే చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా… సజ్జల..కొడాలి నాని..అనిల్ వంటి వారిని రీజనల్ కో ఆర్డినేటర్ల బాధ్యతల నుంచి తప్పించిన సీఎం జగన్.. ఎనిమిది జిల్లాల అధ్యక్షులను మార్చారు. ఎనిమిది మంది జిల్లా అధ్యక్షులను..ఆరుగురు ప్రాంతీయ సమన్వయ కర్తలను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. జగన్ తన తొలి కేబినెట్ లో ఉన్నవారిని తప్పించి వారికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కేటాయించారు. ఇప్పుడు వారిలోనూ కొందరిని మార్చారు.
గుంటూరు జిల్లాకు ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న మాజీ హోం మంత్రి సుచరిత స్థానంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ కు బాధ్యతలు కేటాయించారు. కుప్పం వైసీపీ అభ్యర్ధిగా ఖరారైన భరత్ ను చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. ఆయనను పూర్తిగా నియోజకవర్గం పైనే ఫోకస్ చేయాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లా బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి అప్పగించారు. కేబినెట్ విస్తరణలో పదవులు కోల్పోయిన అవంతి శ్రీనివాస్, పుష్ప శ్రీవాణి, సుచరిత ఇప్పుడు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కీలకమైన విశాఖ జిల్లా బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు అప్పగించారు. పార్వతీపురం మన్యం జిల్లా బాధ్యతలను పరీక్షిత్ రాజుకు కేటాయించారు.
ప్రకాశం జిల్లా అధ్యక్ష బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డికి అప్పచెప్పారు. కర్నూలు జిల్లా బాధ్యతను కర్నూలు మేయర్ బీవై రామయ్యకు అప్పగించారు. తిరుపతి జిల్లా అధ్యక్ష పదవి నుంచి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని తప్పించి దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి కొడుకు రామ కుమార్ రెడ్డికి కేటాయించారు. చెవిరెడ్డి భాస్కర రెడ్డిని పార్టీ అనుబంధాల కో ఆర్డినేటర్ గా నియమించారు. అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలను పైలా నరసింహయ్య కు కేటాయిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.