అధికార పార్టీ బీఆర్ఎస్ (BRS Party) నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లో అపశ్రుతులు చోటు చేసుకుంటున్నాయి. ఖమ్మం జిల్లాలో (Khammam District) ఘోర ప్రమాదంలో కార్యకర్తలు మృతి చెందిన సంఘటన మరువకముందే మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఓ కార్యకర్త గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో విషాదం అలుముకుంది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో ((Yadadri Bhuvanagiri District) చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం (Bommalaramaram) మండలం చీకటిమామిడిలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆలేరు ఎమ్మెల్యే విప్ గొంగిడి సునీతారెడ్డి (Gongidi Sunitha Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె ప్రసంగిస్తున్న సమావేశంలో సమావేశానికి హాజరైన కంచలతండాకు చెందిన పార్టీ కార్యకర్త ధీరావత్ నాను నాయక్ (50) కుప్పకూలిపోయాడు. అకస్మాత్తుగా పడిపోవడంతో తోటి కార్యకర్తలు, నాయకులు అతడికి సపర్యలు చేశారు. అయినా ఫలితం లేదు. ఆయన స్పృహలోకి రాలేదు. వెంటనే తోటి కార్యకర్తలు తమ కారులోనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో పార్టీలో విషాదం అలుముకుంది.
ఈ మృతిపై బీఆర్ఎస్ పార్టీ సంతాపం (Condolence) ప్రకటించింది. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పార్టీ తరఫున బీమా (Insurance), నష్ట పరిహారం అందించనున్నారు. కాగా మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు వివాహమైంది. వ్యవసాయ కూలీగా పని చేస్తూ నాను కుటుంబాన్ని పోషించేవాడు. మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే సునీత రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు.