ముస్లీం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేసీఆర్, మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సానియా మీర్జా తదితరులు పాల్గొన్నారు.
ఈ దేశం మనందరిదని, చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం పోరాడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. ముస్లీం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేసీఆర్, మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సానియా మీర్జా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు. ఈ దేశం మనందరిది.. చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం పోరాడాలన్నారు. మన గంగా తెహజీబ్ సంస్కృతి ఎంతో విశిష్టమైనదన్నారు. ఆవేశంతో కాదు.. ఆలోచనతో ఈ దేశాన్ని కాపాడుకుందామన్నారు. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామన్నారు. తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణ అంటే వెనుకబడింది అనేవారని, ఇప్పుడు అభివృద్ధిలో మన దరిదాపుల్లో ఏ రాష్ట్రం కూడా లేదన్నారు.
తలసరి ఆదాయం తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీలకు పదేళ్లలో కాంగ్రెస్ ఖర్చు చేసింది కేవలం రూ. 1200 కోట్లు మాత్రమేనని, కానీ తెలంగాణ ప్రభుత్వంలో మైనార్టీల కోసం గత 9 ఏళ్లలోనే రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. తెలంగాణ వంటి వేగవంతమైన అభివృద్ధి మిగతా రాష్ట్రాల్లో అభివృద్ధి లేదన్నారు. తాగు, సాగు నీరు, కరెంట్ సమస్యలు పరిష్కరించుకున్నామన్నారు. మహారాష్ట్రలోను పార్టీకి ఘన స్వాగతం లభించిందన్నారు. దేశం కూడా మనలాగే అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యమన్నారు.