»Conduct Crpf Exam In Regional Language Also Mk Stalin Letter To Amit Shah
MK Stalin: CRPF పరీక్షను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలి
CRPF రిక్రూట్మెంట్ కోసం కంప్యూటర్ పరీక్షలో తమిళాన్ని చేర్చకపోవడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్(MK Stalin) వ్యతిరేకించారు. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah)కు లేఖ రాశారు. ఆంగ్లం, హిందీ మాత్రమే కాకుండా ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ పరీక్ష నిర్వహించాలని కోరారు.
CRPF కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష తమిళం సహా ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని కోరుతూ తమిళనాడు సీఎం MK స్టాలిన్(MK Stalin) కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah)కు లేఖ రాశారు. 9,212 ఖాళీల కోసం CRPF కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వాటిలో మొత్తం 579 పోస్టులు తమిళనాడు నుంచి భర్తీ చేయబడుతున్నాయి. ఈ ఉద్యోగాలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహించి ముందుగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
అయితే దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ ఎగ్జామ్ కేవలం ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే నిర్వహిస్తామని CRPF ఇప్పటికే ప్రకటించింది. కానీ అలా చేయడం ద్వారా ప్రాంతీయ భాషపై ఎక్కువగా పట్టు సాధించిన తమిళనాడు ప్రాంత వాసులతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు కూడా అనేక మంది నష్టపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ అన్ని భాషల్లో ఈ ఎగ్జామ్ నిర్వహించాలని కేంద్రాన్ని కోరారు.
ఈ CRPF నోటిఫికేషన్ తమిళనాడు నుంచి దరఖాస్తు చేసుకునే వారి ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని స్టాలిన్(MK Stalin) అన్నారు. ఇది ఏకపక్షం మాత్రమే కాదు, వివక్షాపూరితమైనదని లేఖలో ప్రస్తావించారు. ఇలా నిర్వహించడం ద్వారా హిందీ మాట్లాడే విద్యార్థులకు మాత్రమే ప్రయోజనం చేకూరే అవకాశం ఉందన్నారు. దీంతోపాటు తమిళనాడు అభ్యర్థులు వారి స్వంత మాతృభాషలో పరీక్షను రాసేందుకు అవకాశం కల్పించాలని అమిత్ షాకు పంపిన లేఖలో పేర్కొన్నారు.
CRPF కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్‌మెన్) పోస్ట్ కోసం రిక్రూట్‌మెంట్‌ను నోటిఫై చేసింది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 27న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 25. CRPF రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం నమోదు చేసుకున్న అభ్యర్థులకు CBT జూలై 1 నుంచి 13 వరకు నిర్వహించబడుతుంది. ఇప్పటివరకు పరీక్షను ఇంగ్లీష్, హిందీ భాషలలో మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని ప్రశ్నలూ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ టైప్‌లో ఉంటాయి.