విలక్షణ నటుడు, తమిళ స్టార్ హీరో కమల్ హాసన్… ఇటీవల విక్రమ్ సినిమాతో అదరగొట్టారు. గత కొంతకాలంగా తన సినిమాలు సరైన ఫలితం ఇవ్వకపోగా.. విక్రమ్ సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చారు. ఆయన దాదాపు 230కి పైగా సినిమాల్లో నటించారు. కాగా… తన 234వ సినిమాని క్లాసికల్, ఎవర్ గ్రీన్ డైరెక్టర్ మణిరత్నంతో చేయనున్నట్లు ప్రకటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చి దాదాపు 35 సంవత్సరాలు అవుతుండటం విశేషం.
35 ఏళ్ల క్రితం వీరిద్దరూ కలిసి నాయకన్ అనే సినిమా చేశారు అది ఆ సమయంలో ఒక సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. తెలుగులో దానిని నాయకుడు అనే పేరుతో రిలీజ్ చేయగా తెలుగులో కూడా మంచి హిట్ అయింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి కొన్నిసార్లు సినిమా చేయడానికి ప్రయత్నించారు కానీ కాంబినేషన్ సెట్ అవ్వలేదు.
ఇప్పుడు వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నట్లు ఒక అధికారిక ప్రకటన అయితే వెలువడింది. కమల్ హాసన్ కెరియర్ లో 234వ సినిమాగా ఈ సినిమా రూపంతో పోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనుండగా మద్రాస్ టాకీస్, రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్లపై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇక కమల్ హాసన్ కూడా నిర్మాణ భాగస్వామ్యం తీసుకోబోతున్నారు.
ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ… ‘ 35 సంవత్సరాల క్రితం మణిరత్నంతో పని చేసినపుడు ఎంత ఉత్సాహంగా వున్నానో ఇప్పుడు అంతే ఉత్సాహంగా వుంది. ఒకేరకమైన మనస్తత్వంతోవున్న వారితో కలసి పని చేయడం గొప్ప ఉత్తేజాన్నిస్తుంది. ఈ ఉత్సాహంలో రెహమాన్ కూడా తోడయ్యారు. మిస్టర్ ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ఈ వెంచర్‌ని ప్రజంట్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు.