జయసుధ అంటేనే గొప్పగొప్ప పాత్రలు, అద్భుతమైన పెరఫారమెన్స్ ఇట్టే గుర్తొస్తాయి. ఎన్ని సినిమాలు, ఎన్ని హిట్లు…లెక్కేలేనంత పెద్ద లిస్ట్. 50 ఏళ్ళకి క్రితం పండంటి కాపురం సినిమాలో యంగ్ క్యారెక్టర్ చేయడంతో ప్రారంభమైన జయసుధ కెరీర్ తర్వాతి రోజులలో ఊహించనంత ఎత్తుకి ఎదిగింది. ఎన్టీఆర్, ఎఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు దగ్గర్నుంచి, చంద్రమోహన్ వరకూ కూడా జయసుధ చూడని సక్సెస్ తెలుగు చిత్ర పరిశ్రమలో లేనేలేదు. హిట్లు, సూపర్ హిట్లు పక్కనబెడితే జయసుధ అంటే ఓ గొప్ప నటీమణి అనే రికార్డును ఆమె నిలబెట్టుకోగలిగారు. కేవలం పెరఫార్మింగ్ కెపాసిటీతో మాత్రమే జయసుధ తనకోసం తాను ప్రత్యేకమైన అభిమాన ప్రపంచాన్ని సృష్టించుకోగలిగారు.
ఆమెకు మరో గ్రేట్ రికార్డుంది. ప్రపంచ సినిమా చరిత్రలోనే జయసుధ చేసినన్ని టైటిల్ రోల్స్ ప్రపంచంలోనే మరో హీరోయిన్ చేయలేదు. అంత గొప్ప రికార్డు సంపాదించుకన్న ఏకైక నటీమణిగా కొద్దిరోజుల్లోనే జయసుధ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డల్లోకి ఎక్కబోతున్నారు. ఇవన్నీ పక్కన బెడితే జయసుధ తన అభిరుచికి అనుగుణంగా అనేక చిత్రాలు నిర్మించి కూడా తనదైన ముద్రని సినిమా పరిశ్రమ మీద వేయగలిగారు. కాకపోతే, ఆమె చివరిగా నిర్మించిన హేండ్సప్ చిత్రం ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ సినిమా ఘోరమైన అపజయం పాలై, జయసుధకి తీరని నష్టాలను తీసుకొచ్చింది. ఆ తర్వాత జయసుధ చిత్రనిర్మాణం వైపుకి దృష్టి మరల్చలేదు.
కానీ, ఆ తరం దర్శకులే కాకుండా, ఈ తరం దర్శకులు కూడా జయసుధ తప్పనిసరిగా తమ చిత్రాలలో ఉండాలని పట్టుబట్టి కొన్ని ప్రత్యేకపాత్రలను ఆమెకోసం రాసుకోవడం ఆమె గ్రేట్‌నెస్‌కి ఓ మేలిమి ఉదాహరణ. అందువల్ల ఆమె ఇప్పుడు కూడా తన ప్రొఫెషన్లో బిజీగానే ఉంటున్నారు. దీనికి తోడు ఓ హాలీవుడ్ చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నారు ప్రస్తుతం.
ఇవన్నీ ఒకెత్తు అయితే, జయసుధ త్వరలోనే మెగాఫోన్ పట్టుకోబోతున్నారన్నది తాజా వార్త. జయసుధకి కథల మీద, స్క్రీన్ ప్లే మీద పటిష్టమైన అవగాహన ఉంది, రచయితలతో కథల గురించి చర్చించడం, తన సొంత చిత్రాల విషయంలో ఆఫ్‌బీట్ చిత్రాల కథలకే ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వడం వంటివి ఆమెలోని ఓ దర్శకురాలిని ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తునే ఉన్నాయి. కాకపోతే ఆమె ఎప్పుడూ డైరెక్టర్ కావాలని గానీ, అవుదామని గానీ మాట మాత్రంగా కూడా సన్నిహితులతో సైతం నోరు మెదపలేదు. ఈ వార్తని జయసుధ కొడుకు నీహార్ కపూర్ హిట్ టీవికి ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. త్వరలోనే మదర్ డైరెక్ట్ చేయబోతున్నారని నీహార్ చెప్పాడు. ప్రముఖ మహిళా దర్శకురాలు శ్రీమతి విజయనిర్మల బంధువుగా, ఆమెతోనే తన తొలిచిత్రం నటించిన నేపథ్యం, వీటన్నిటి స్ఫూర్తితో జయసుధ దర్శకత్వ బాధ్యతలలో కూడా విజయవంతమవుతారని ఆశిద్దాం.