ఆరోగ్యం సరిగా లేదని మూడేళ్ల చిన్నారిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే.. అక్కడ వైద్యులు చిన్నారి చనిపోయిందని చెప్పారు. దీంతో.. కన్నీరు మున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు చివరకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. స్మశాన వాటికకు కూడా తీసుకువెళ్లారు. తీరా అక్కడకు వెళ్లాక.. ఆ చిన్నారి లేచి కూర్చుంది. ఈ ఘటన స్థానికంగా అందరినీ షాకింగ్ గురి చేసింది.అయితే.. మళ్లీ గంట తర్వాత.. ఆ చిన్నారి నిజంగానే చనిపోవడం గమనార్హం. ఈ సంఘటన మెక్సికోలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మెక్సికో నగరానికి చెందిన మూడేళ్ల చిన్నారి అనారోగ్యానికి గురైంది. ఆమెను తల్లి మేరీ జేన్ స్థానిక వైద్యుడి వద్దకు తీసుకువెళ్లింది. ఆ చిన్నారికి కడుపులో నొప్పి, వాంతులు, జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యుడు.. పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్లమని సూచించాడు. అక్కడ నుంచి ఆమె చిన్నారిని మరో వైద్యుడు వద్దకు తీసుకువెళ్లింది. అక్కడ వైద్యులు.. పండ్ల రసం, నీళ్లు తాగించాలని సూచించాడు. వేరే మందులు కూడా రాసిచ్చాడు.
అవి వాడినా చిన్నారిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో.. పెద్ద ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డుకు తీసుకువెళ్లారు. అక్కడ పరిశీలించిన వైద్యులు, డీ హైడ్రేషన్ కారణంగా చిన్నారి చనిపోయినట్లు గుర్తించారు. అదే విషయాన్ని వారికి చెప్పారు.
చిన్నారి మృతదేహంతో తల్లిదండ్రులకు ఇంటికి చేరుకున్నారు. చిన్నారి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. చిన్నారిని శవ పేటికలో సైతం పెట్టారు. అయితే.. అందులో ఉన్నప్పుడు చిన్నారి కదిలినట్లు తల్లికి అనిపించింది. ఆమె అదే చెప్పగా.. అంతా నీ భ్రమ అంటూ అక్కడున్నవారు ఆమెకు చెప్పారు. కాసేపటి తర్వాత చిన్నారి కళ్లు కదిలించడం ఆమె అమ్మమ్మ చూసింది. దీంతో.. వెంటనే శవపేటికలో నుంచి బయటకు తీయగా.. చిన్నారికి ప్రాణం ఉందని గుర్తించారు. వెంటనే.. ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. అక్కడ వైద్యం అందిస్తుండగానే.. చిన్నారి ఈసారి నిజంగానే కన్నుమూసింది.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారి చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేపడుతున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.