»Massive Theft At Former Ips Officer Residence In Jubilee Hills
Jubilee Hills మాజీ పోలీస్ అధికారి ఇంట్లో భారీ చోరీ.. ఖరీదైన దొంగ
దొంగను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తును ఏర్పాటు చేశారు. కాగా దొంగ ఈ ఇంటిని రెక్కీ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పది రోజులుగా ఇంట్లో ఎవరూ ఉండకపోవడంతో అదును చూసి చోరీకి పాల్పడ్డాడని తేలింది.
హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోయారు. మాజీ ఐపీఎస్ అధికారి (Rtd IPS Officer) ఇంట్లో భారీ దొంగతనాని (Theft)కి పాల్పడ్డారు. ఏకంగా 30 తులాల బంగారు (Gold), 20 వెండి (Silver) ఆభరణాలతో పాటు 500 అమెరికన్ డాలర్లు, 8 విలువైన చేతి గడియారాలు (Watches) దొంగలించబడ్డాయి. డ్రైవర్ ఫోన్ చేసి విషయం చెప్పగా వచ్చి చూడగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ (Jubilee Hills Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ (Hyderabad) జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ (Prashasan Nagar)లో ప్లాట్ నంబర్ 222లో మాజీ ఐపీఎస్ కొమ్మి ఆనందయ్య (Kommi Anandaiah) నివసిస్తున్నారు. ఈనెల 16న భార్యతో కలిసి కుమారుడి కోసం ఏపీలోని కాకినాడ (Kakinada)కు వెళ్లారు. ఆయన కుమారుడు రమేశ్ కాకినాడ మున్సిపల్ కమిషనర్ గా పని చేస్తున్నాడు. పది రోజులుగా ఆనందయ్య అక్కడే ఉన్నారు. అయితే శనివారం సెల్లార్ లో నివసించే డ్రైవర్ ఫోన్ చేసి ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పాడు. హుటాహుటిన హైదరాబాద్ కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంట్లోని సీసీ కెమెరా పరిశీలించారు. దొంగ ఇంట్లోకి దూరిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.
ఈనెల 24న శుక్రవారం అర్ధరాత్రి 1.15 ప్రాంతంలో దొంగ ఆనందయ్య ఇంటి వెనుక నుంచి రెండో అంతస్తుకు చేరుకున్నాడు. లోపల గడియ పెట్టి ఉన్న తలుపును తన్నడంతో తెరుచుకుంది. మొదట వంట గదిలోకి దూరాడు. అక్కడ ఉన్న వెండి వస్తులను సర్దేసుకున్నాడు. అనంతరం మొదటి అంతస్తులోకి వచ్చి బీరువా వద్దకు చేరుకున్నాడు. తాళం లేకుండానే బీరువా తెరిచి లాకర్ లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేశాడు. వాటితో పాటు నగదు, డాలర్లు, చేతి గడియారాలను తస్కరించాడు. దాదాపు గంటపాటు ఆ ఇంట్లో గడిపాడు. బయటకు వచ్చిన దుండగుడు ఇతరులను లిఫ్ట్ అడిగి బైక్ పై ప్రధాన రహదారిపైకి చేరుకున్నాడు. అక్కడి నుంచి సికింద్రాబాద్ మీదుగా వెళ్లిపోయి అదృశ్యమయ్యాడు.
మాజీ అధికారి ఆనందయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తును ఏర్పాటు చేశారు. కాగా దొంగ ఈ ఇంటిని రెక్కీ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పది రోజులుగా ఇంట్లో ఎవరూ ఉండకపోవడంతో అదును చూసి చోరీకి పాల్పడ్డాడని తేలింది. దొంగ పాత నేరస్తుడు అయ్యి ఉంటాడని అనుమానిస్తున్నారు. త్వరలోనే దొంగను పట్టుకుంటామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.