ఒక దేశ ప్రజలు.. ఉపాధి కోసమో లేదంటే…టూరిజం కోసమో ఇతర దేశాలకు వెళ్లడం చాలా సహజం. ఎక్కువగా భారతీయులే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళుతూ ఉంటారు. అప్పుడప్పుడు అక్కడి పౌరులు సైతం.. మన దేశాన్ని చూడటానికి వస్తూ ఉంటారు. అయితే… మన దేశంలో పర్యటించడానికి వస్తున్న అమెరికా పౌరులకు ఆ దేశ విదేశాంగశాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.
భారత్‌లో పర్యటించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అమెరికా పౌరులపై నేరాలు, ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంటుందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. దీనికి సంబంధించి ట్రావెల్ అడ్వయిజరీని జారీ చేసింది.
ఉత్తర తెలంగాణతో పాటు దేశంలోని అనేక ఇతర రాష్ట్రాలకు ప్రయాణించవద్దని సూచించింది. దేశంలో మావోయిస్టు కార్యకలాపాలను ప్రస్తావిస్తూ.. మధ్య, తూర్పు భారతదేశానికి ప్రయాణం చేయవద్దని చెప్పింది.
ఇటీవల హైదరాబాద్ నగర పోలీసులు పాకిస్తాన్ ఆధారిత లస్కర్-ఎ-తోయిబాతో ముడిపడి ఉన్న ఉగ్రవాద సంబంధిత కార్యాకలాపాలను హైదరాబాద్ నగర పోలీసులు ఛేదించిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అయితే స్టేట్ డిపార్ట్మెంట్.. ఇండియా ట్రావెల్ అడ్వైజరీ స్థాయిని స్కేల్ 2కి తగ్గించింది. (ఇందులో ఒకటి నుంచి నాలుగు స్కేల్స్ ఉంటాయి.) రెండో స్కేల్ అంటే అత్యధికం.
తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ లోని గ్రామీణ ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు తీవ్రవాద గ్రూపులు పెద్ద ఎత్తున క్రియాశీలకంగా ఉన్నాయని అమెరికా అడ్వైజరీ తెలిపింది.
కాగా… అమెరికా ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేసిన అంశంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యాటకులకు భారత్ సురక్షిత దేశంగా ఉంటుందని, దేశంలో పర్యటలను చేస్తున్న పర్యాటకులక ప్రాధాన్యత ఇస్తూ వారికి సురక్షితంగా తిరిగి విదేశాలకు చేరే విధంగా చూస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి అని అధికారులు చెబుతున్నారు.
ఆమెరికా కావాలనే ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తూ పర్యాటకుల్లో ఆందోళన కలిగేలా చేస్తోందని పేర్కొన్నది. గత కొంతకాలంగా అమెరికాతో భారత్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే, అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నది. అమెరికా గడ్డమీదనే బహిరంగంగా భారత విదేశాంగశాఖ విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్‌పై బురదజల్లేందుకు అమెరికా ఈ విధమైన ఎత్తుగడలు వేస్తోందని అధికారులు చెబుతున్నారు. ఎన్ని విమర్శలు చేసినా ప్రపంచంలో భారత్‌కు ఉన్న పరపతి తగ్గదని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు.