జమ్ముకశ్మీర్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి దారుణ హత్యకు గురయ్యారు. జైళ్ల శాఖ డీజీ హేమంత్ లోహియాను సోమవారం రాత్రి గోంతుకోసి చంపేశారు. లోహియా ఇంట్లో పనిచేసే యాసిర్ అహ్మద్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అసోంకు చెందిన 57 ఏళ్ల హేమంత్ ఇటివలే పదోన్నతి పొంది ఆగస్టులో జైళ్ల డీజీగా నియమితులయ్యారు.
ఘటనా స్థలంలో సేకరించిన సీసీటీవీ ఫుటేజీలో యాసిర్ నేరం చేసిన తర్వాత పారిపోతున్నట్లు రికార్డైందని కశ్మీర్ పోలీసులు తెలిపారు. యాసిర్ గత 6 నెలలుగా ఈ అధికారి ఇంట్లో పనిచేస్తున్నాడని, అతను డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని ప్రాథమిక విచారణలో తెలిసింది. మరోవైపు పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్ ఈ హత్యకు తామే బాధ్యలమని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పర్యటించనున్న వేళ ఈ హత్య జరగడం కలకలం రేపింది. ఈ క్రమంలో యాసిర్ అహ్మద్‌కు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని సంబంధిత అధికారులతో పంచుకోవాలని జమ్మకశ్మీర్ పోలీసులు పౌరులను కోరారు.