»Nara Lokesh Warns Visaka People Over Capital Issue
Nara Lokesh: విశాఖ ప్రజలకు లోకేష్ హెచ్చరిక! రోజాకు సవాల్
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి , వైసీపీ నేతలు రాజధాని పేరుతో విశాఖ ప్రజలను మోసం చేయడం ఖాయమని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan), వైసీపీ నేతలు (YCP) రాజధాని (Capital) పేరుతో విశాఖ (Visaka) ప్రజలను మోసం చేయడం ఖాయమని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) హెచ్చరించారు. యువ గళం (Yuvagalam) పాదయాత్ర ఇరవయ్యో రోజు తిరుపతి జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరావతి (Amaravati) రైతులకు రాజధానిపై జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వారిని మోసం చేశారని ఆరోపించారు. కర్నూలులో హైకోర్టు అని చెప్పి రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారని, అలాగే విశాఖను రాజధాని అంటూ ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తారన్నారు. మోసం చేయడమే జగన్ నైజం అని విమర్శించారు. గత ఎన్నికల్లో అబద్దాల హామీలతో దళిత, పేదల ఓట్లతో గెలిచిన జగన్ ఇప్పుడు ద్రోహిగా మారాడన్నారు. విశాఖ పేరుతో, దళితులు, పేదల పేరుతో రియల్ ఎస్టేట్ (Real Estate) వ్యాపారం చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. భూముల పంపిణీ పేరుతో రూ.1 లక్ష ఉన్న వాటిని ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి, ఒక్కో ఎకరానికి రూ.40 లక్షలకు ప్రభుత్వానికి విక్రయించారన్నారని ధ్వజమెత్తారు. అందులోనే సెంటు భూమిని ఇస్తూ, పైగా ఇళ్లు నిర్మించకుంటే రద్దు చేస్తామని హెచ్చరికలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. భూములను దౌర్జన్యంగా లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వీటన్నింటిపై విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలంతా బస్సు ఛార్జీలను విపరీతంగా పెంచేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. వైసీపీ పాలనలోని కష్టాలను చాలామంది మహిళలు తనకు చెప్పుకొని కన్నీరు పెడుతున్నారన్నారు.
మంత్రి రోజా (Roja) పైన కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె తమపై అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎనిమిదేళ్లుగా తాము తమ ఆస్తులను ప్రకటిస్తున్నామని, మరి రోజా, జగన్ ఇతర 150 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఆస్తులను ప్రకటిస్తారా అని సవాల్ చేశారు. వైసీపీ ఉన్నదే దోపిడీ కోసమని మండిపడ్డారు. మహిళల అభ్యున్నతికి ఎవరు పాటుపడ్డారో తెలుసుకోవాలని హితవు పలికారు. ఆర్థిక స్వాతంత్రం ఎవరు కల్పించారనే అంశాలపై చర్చకు సిద్ధమన్నారు. సమయం, స్థలం చెబితే తాను నడుచుకుంటూనే వస్తానని రోజాకు (Roja) సూచించారు. తాను మహిళలను కించపరిచినట్లుగా ఆరోపణలు చేస్తున్నారని, అలా మాట్లాడినట్లు నిరూపిస్తే క్షమాపణ కోరుతానని, మరి నేను కాదని నిరూపిస్తే మీరు సిద్ధమా అని ప్రశ్నించారు.
పాదయాత్ర కొనసాగుతున్న సమయంలోనే లోకేష్ ఓ ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఛార్జీలు పెరిగిన విషయాన్ని కనుక్కున్నారు. టీడీపీ, వైసీపీ పాలనలోని ఆర్టీసీ ఛార్జీలను అడిగి తెలుసుకున్నారు. బస్సు ఛార్జీలు ఇంతలా పెంచితే పేదవాడు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం తర్వాత ఎలా ఉందని డ్రైవర్, కండక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బస్సులోని ఓ ప్రయాణీకురాలు… తన భర్తకు, తన తనయుడికి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు హాస్పిటల్ వారు ఆరోగ్యశ్రీ లేదని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ విధానాన్ని సరైన విధంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.