»2004 14 Was A Lost Decade Current One Will Be Known As Indias Decade Modi
2004-2014లో దశాబ్ద కాలాన్ని నష్టపోయాం: ప్రధాని మోడీ
2004 నుండి 2014 కాలంలో కాంగ్రెస్(Congress) పాలనలో భారత్ అవినీతిమయమైందని, 2జీ స్కామ్ నుండి మొదలు పెడితే కామన్వెల్త్ స్కామ్ వరకు ఎన్నో వెలుగు చూశాయని ప్రధాని నరేంద్ర మోడీ లోకసభలో మండిపడ్డారు.
2004 నుండి 2014 కాలంలో కాంగ్రెస్(Congress) పాలనలో భారత్ అవినీతిమయమైందని, 2జీ స్కామ్ నుండి మొదలు పెడితే కామన్వెల్త్ స్కామ్ వరకు ఎన్నో వెలుగు చూశాయని ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) ధ్వజమెత్తారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆయన లోకసభలో మాట్లాడారు. కాంగ్రెస్ హయాం దశాబ్ద కాలంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమైందన్నారు. పదేళ్ల కాలంలో ధరలు రెట్టింపయ్యాయన్నారు. అప్పుడు నిరుద్యోగం పెరిగిందన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉగ్రవాదం రాజ్యమేలిందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయం భారత అభివృద్ధిని దెబ్బతీసిందన్నారు. మధ్య తరగతిని గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంతో దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపారన్నారు. విపక్షాలను ఈడీ ఏకం చేస్తోందన్నారు. అక్రమాలు, అవినీతికి పాల్పడిన వారు ఒక్కటవుతున్నారన్నారు. చివరకు ఆర్బీఐ, ఈసీని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు. దమ్ముంటే లాల్ చౌక్‌లో త్రివర్ణ పతాకం ఎగురువేయలని తీవ్రవాదులు హెచ్చరించేవారని, ఇప్పుడు స్వేఛ్చగా ఎగురువేయగలుగుతున్నామన్నారు.
ఇప్పుడు మంచి జరుగుతోంది కాబట్టి, ప్రజల నుండి మాకు ఆమోదం లభిస్తోంది కాబట్టి వారు నిరాశలో మునిగిపోయారని కాంగ్రెస్ పార్టీని (Congress) ఉద్దేశించి అన్నారు. ఇప్పుడు దేశంలోని ప్రతి రంగంలో ఆశ చిగురిస్తోందన్నారు. ఒకప్పుడు భారత దేశం బలహీనపడిందని చెప్పేవారని, ఇప్పుడు ఇతర దేశాలను కూడా భారత్ బలవంతంగా ఒప్పిస్తోందని అంటున్నారని వ్యాఖ్యానించారు. తాము దాదాపు రెండేళ్లుగా 80 కోట్ల మందికి రేషన్ ఉచితంగా అందిస్తున్నామని, వన్ నేషన్ – వన్ రేషన్ కార్డు వ్యవస్థను తీసుకు వచ్చామని, అత్యంత పేదలకు ఇప్పుడు దేశంలో ఎక్కడైనా రేషన్ లభిస్తోందని గుర్తు చేశారు. మూడు కోట్లకు పైగా పక్కా ఇళ్లు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 2 కోట్లమంది కుటుంబాలకు లాభం జరిగిందని చెప్పారు. ఇన్ని లాభాలు అందుకున్న ప్రజలు విపక్షాల ఆరోపణలను పక్కన పెడతారన్నారు. విపక్షాలు చేసే నీచ ఆరోపణలను ప్రజలు ఏమాత్రం నమ్మరని చెప్పారు. పీఎం కిసాన్ (PM Kisan) ద్వారా రైతులకు నగదు సాయం చేస్తున్నట్లు చెప్పారు. కష్టకాలంలో ఆదుకున్న వ్యక్తి మోడీ అన్నారు. కానీ ఏళ్లపాటు ప్రజలు కష్టాల్లో ఉండేలా మీరు చేశారని దుయ్యబట్టారు. మోడీ దేశంలోని 25 కోట్ల కుటుంబాల్లో సభ్యుడని, తన చుట్టూ ఉన్నది నమ్మకమనే సురక్ష కవచమన్నారు.
సొంత ఇంటిని పొందిన సామాన్యుడు ఇప్పుడు విపక్షాలు తమపై విమర్శలు చేస్తే నమ్ముతాడా అని ప్రశ్నించారు. కలలు, సంకల్పంతో ముందుకు సాగుతున్న దేశం మనది అన్నారు. ప్రస్తుతం ఈ సభలో కొందరు పూర్తి నిరాశలో మునిగిపోయారని, వారి నిరాశకు కూడా కారణాలు లేకపోలేదని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఇందుకు ప్రజలు పదేపదే ఇస్తున్న తీర్పులు కారణమన్నారు. ఈ నిరాశ కారణంగా వారికి నిద్రపట్టడం లేదన్నారు. కొంతమందికి మోడీని తిడితేనే తమకు దారి ఏర్పడుతుందని భావిస్తున్నారని, కానీ మోడీపై నమ్మకం కేవలం పేపర్ హెడ్ లైన్స్ నుండి రాదన్నారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం జీవితం ధారపోశానన్నారు. మోడీపై దేశ ప్రజలకు ఉన్న నమ్మకం వీళ్లకు ఎవరికీ అర్థం కాదన్నారు. వీళ్లకు తప్పుడు ఆరోపణలు చేయడం మాత్రమే తెలుసునని విమర్శించారు. తలాతోక లేని మాటలు వీళ్లకు అలవాటుగా మారిందన్నారు. ఒకసారి ఓ మాట, మరోసారి మరో మాట మాట్లాడుతారన్నారు.