తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఆన్లైన్ లో దర్శనం, వసతి టిక్కెట్లు కొనుక్కోవాలనే నిబంధన వచ్చాక సామాన్య భక్తులకు కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఇంతకుముందు టీటీడీ కళ్యాణమండపాలలో తిరుమలకు సంబందించిన టిక్కెట్లు అన్నీ స్లాట్ విధానం బట్టి 4 నెలలు ముందుగానే అందుబాటులో ఉండేవి. ఫోన్ సదుపాయం ఉండేది, భక్తులు కౌంటర్లకు ఫోన్ చేసి టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయో లేదో కనుక్కుని… అక్కడకు వెళ్లి బుక్ చేసుకునేవారు. ఆ తరువాత ట్రైన్ టికెట్స్ రేజర్వేషన్ లాంటివి చేయించుకునే వారు.
ఏళ్ళు గడిచేకొద్దీ పాత పద్ధతులకు స్వస్తి పలికి పూర్తిగా ఆన్లైన్ లో మాత్రమే దర్శనం, సేవ, వసతి టిక్కెట్లు కొనుకున్నేలా రూల్స్ మార్చింది టీటీడీ. చదువుకున్నవారికి ఇవి బాగానే ఉన్నా, నిరక్షరాస్యులకు ఇవి కొంత భారంగానే మారాయి. ఇంటర్నెట్ సెంటర్లకు, దళారుల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం లో టూరిజం శాఖ తిరుమల వెళ్ళడానికి ఒక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. apsrtc తో అనుసంధానంగా ఈ తిరుమల ప్యాకేజీ అందుబాటులో ఉంది. రానూపోనూ ఏసీ స్లీపర్ బస్సు టిక్కెట్లు, దర్శనం టిక్కెట్లు, తిరుమల కొండపైన వసతి కలిపి పెద్దలకు రూ. 3970/-, పిల్లలకు రూ. 3670/- వసూలు చేస్తున్నారు. మొదట ఈ వెసులుబాటు విశాఖ ప్రజలకు మాత్రమే ఉండేది. ఇప్పుడు బెజవాడ వాసులకు కూడా అందుబాటులోకి వచ్చింది. రాత్రి 11 గంటలకు విజయవాడ బెంజ్ సర్కిల్ పిల్లర్ 4 దగ్గర బస్సు స్టార్ట్ అయ్యి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. కొండపై వసతి, అల్పాహారం పూర్తయ్యాక శ్రీవారి దర్శనం ఉంటుంది. మధ్యాహ్న భోజనం అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం ఉంటుంది. రాత్రి 7 గంటలకు తిరుపతి నుంచి తిరుగు ప్రయాణం ఉంటుంది.