»Failure To Consider Employee For Promotion A Violation Of Fundamental Right Sc
SC : ప్రమోషన్‌కి ఉద్యోగిని పరిగణించకపోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే : సుప్రీం
ఏ ఉద్యోగంలో అయినా తగిన సమయానికి ఉద్యోగిని ప్రమోషన్ కోసం పరిగణించకపోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Supreme Court : తగిన అర్హతలు, సీనియారిటీ ఉన్నప్పుడు ఆ ఉద్యోగిని ప్రమోషన్ కోసం పరిగణలోకి తీసుకోకపోతే అది ఆ వ్యక్తి ప్రాథమిక హక్కులను(fundamental rights) ఉల్లంఘించడమే అవుతుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) తీర్పిచ్చింది. హిమా కోహ్లీ, అహా్సనుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. అర్హతలన్నీ కలిగి ఉన్నప్పుడు ప్రమోషన్‌కు పరిగణలోకి తీసుకోకపోవడం సరికాదు. కానీ కచ్చితంగా ప్రమోషన్ రావాల్సిందే అన్నది ఏమీ లేదని తెలిపింది. అది ప్రాథమిక హక్కుల్లో లేదని సూచించింది.
ఈ విషయంలో బీహార్‌కు చెందిన ఓ ఉద్యోగి తన ప్రమోషన్ విషయాన్ని సవాల్ చేస్తూ తొలుత బీహార్ హైకోర్టులో కేసు వేశారు. అండర్ సెక్రటరీగా ఉన్న ధరమ్ దేవ్ అనే వ్యక్తి జాయింట్ సెక్రటరీ పదవికి 1997, జూలై 29 నుంచి అర్హులుగా ఉన్నారు. అయితే ఆయనను అప్పటి నుంచి ప్రమోషన్‌కు పరిగణనలోకి తీసుకోలేదు. 2003లో ఆయనకు ప్రమోషన్‌ను ఇచ్చారు. ఈ విషయమై తొలుత ధరమ్ దేవ్ పాట్నా హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయన ప్రమోషన్‌ను 1997, జూలై 29 నుంచే పరిగణించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
దీంతో ఈ కేసు తర్వాత సుప్రీం కోర్టుకు చేరింది. అక్కడ సుప్రీం కోర్టు మాత్రం భిన్నంగా స్పందించింది. ప్రమోషన్‌కు( promotion) పరిగణలోకి తీసుకోకపోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే కాని, కచ్చితంగా ప్రమోషన్ ఇవ్వాలన్న నిబంధన ఏమీ లేదని స్పష్టం చేసింది. పై పోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ కచ్చితంగా ప్రమోషన్ని ఇవ్వాల్సిన స్థితి లేదని నొక్కి చెప్పింది. ప్రమోషన్‌కు కావాల్సిన అన్ని అర్హతలనూ ఉద్యోగి సాధించినప్పటికీ అతడిని ఆ పోస్ట్‌కి పరిగణించకపోతే మాత్రం తప్పు అని వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16(1) ప్రకారం ప్రమోషన్‌కు పరిగణించడం అనేది ప్రాథమిక హక్కుగా(fundamental right) ఉందని చెప్పింది.