»Mumbai Rain Woman Killed Three Injured After Building Balcony Collapses Due To Heavy Rain
Mumbai Rains : ముంబైలో వర్షం బీభత్సం.. కూలిన నాలుగు అంతస్తుల భవనం
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. శనివారం దక్షిణ ముంబైలోని గ్రాండ్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న నాలుగు అంతస్తుల నివాస భవనం కూలిపోయింది.
Mumbai Rains : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. శనివారం దక్షిణ ముంబైలోని గ్రాండ్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న నాలుగు అంతస్తుల నివాస భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఒక మహిళ మరణించగా, మరో ముగ్గురు గాయపడినట్లు అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటన ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిందని ఆయన తెలిపారు.
“బాల్కనీలో కొంత భాగం కూలిపోవడంతో నలుగురు గాయపడ్డారు” అని అధికారి తెలిపారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురు చికిత్స పొందుతుండగా.. ఒక మహిళ మృతి చెందింది. కూలిన భవనం మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (MHADA) కి సంబంధించిందని అధికారి తెలిపారు. దీనిని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ప్రమాదకరంగా ప్రకటించింది. గతంలో కూడా ఈ భవనానికి నోటీసులు జారీ చేశామన్నారు. ఈ ఘటన తర్వాత భవనం నుంచి ఏడుగురిని సురక్షితంగా బయటకు తీశారని అధికారి తెలిపారు.
ముంబైలో భారీ వర్షం
శనివారం ముంబై, దాని శివారు ప్రాంతాల్లో అడపాదడపా భారీ వర్షాలు కురిశాయి. దీని కారణంగా మెట్రోపాలిస్‌లోని కొన్ని ప్రాంతాలు వరదలకు గురయ్యాయి. అయితే లోకల్ రైలు సర్వీసులు సాధారణంగానే నడుస్తున్నాయి. శనివారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో ముంబైలో 91 మిల్లీమీటర్ల వర్షం పడగా, తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో వరుసగా 87 మిల్లీమీటర్లు, 93 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక్కడ భారీ వర్షం హెచ్చరిక
నాగ్‌పూర్, విదర్భ ప్రాంతంలో శనివారం భారీ వర్షాలు.. రాబోయే రెండు రోజుల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆ శాఖ సూచించింది. శనివారం చంద్రాపూర్‌లో రెడ్ అలర్ట్, నాగ్‌పూర్, అమరావతి, వార్ధా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ముంబైలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అంచనా వేసింది.