బీఆర్ఎస్ నేత, ఒడిశా మాజీ ఎమ్మెల్యే అర్జున్ చరణ్ దాస్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. రైతుల సమావేశంలో పాల్గొనేందుకు భువనేశ్వర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. జాజ్‌పూర్ జిల్లాలో శనివారం ఉదయం అతని బైక్‌ను ట్రక్కు ఢీకొట్టింది. బారుహాన్ సమీపంలో ఖరస్రోటా నదిపై ఉన్న వంతెన మీదుగా అర్జున్ దాస్ వెళ్తున్నారు. అటు వైపు వచ్చిన ట్రక్.. వేగంగా ఢీ కొంది. తీవ్రంగా గాయపడిన అర్జున్ దాస్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. తర్వాత కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు. అర్జున్ దాస్తోపాటు ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. జాజ్‌పూర్ మాజీ ఎంపీ అనాది దాస్ కుమారుడు అర్జున్ దాస్. బింజర్‌పూర్ అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఆకస్మిక మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.