Tata Nexon Icng : టాటా సంస్థకు చెందిన నెక్సాన్ కంపాక్ట్ ఎస్‌యూవీల విభాగంలో మంచి డిమాండ్ ఉన్న కారు అనే చెప్పవచ్చు. సంస్థ దీని ఐసీఎన్జీ(Icng) మోడల్ని భారత్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా దీని మోడల్‌ను భారత్ మొబిలిటీషో 2024లో సంస్థ ప్రదర్శించింది. త్వరలోనే దీన్ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.
ఇప్పటికే కాంపాక్ట్ ఎస్‌యూవీల విభాగంలో మంచి డిమాండ్ ఉన్న ఈ కారు ఇప్పుడు సీఎన్జీ(cng) ఆప్షన్లో రానుండటంతో గేమ్ ఛేంజర్‌గా మారుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. టర్బో ఛార్డ్జ్ పెట్రోల్ ఇంజన్‌తో ఇది వస్తోంది. దీంతో ఈ ఆప్షన్‌తో మార్కెట్లోకి వస్తోన్న తొలి కారుగా ఇది నిలవనుంది. రానున్న ఆరు లేదంటే ఎనిమిది నెలల్లో ఇది దేశీయ మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది. టాటా మోటార్స్ సీఎన్జీ ఆప్షన్లపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. రానున్న రోజుల్లో వినియోగదారులు ఎక్కువగా వీటిపై మొగ్గు చూపుతారని అంచనాలు ఉండటంతో వీటి తయారీకి మొగ్గు చూపుతోంది. ఇక ఈ కారు (Tata Nexon iCNG) ఫ్యూయల్ కెపాసిటీ ఎంత అన్నది మాత్రం సంస్థ ఇంకా వెల్లడించలేదు. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుందని మాత్రం తెలిపింది. ప్రస్తుతం టర్బో ఛార్జర్ సీఎన్జీ టెక్నాలజీ కాంబినేషన్లో భారత మార్కెట్లో కార్లు లేవు. అందుకనే ఈ ఆప్షన్లో వస్తున్న మొదటి కారు ఇదేనని సంస్థ వెల్లడించింది.