క్వీన్ ఎలబజెత్ ఇటీవల తుది శ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు ఇప్పుడు జరుగుతున్నాయి. అయితే… ఆమె ఇంతకాలం ధరించిన కిరీటంలో కోహినూర్ వజ్రం ఉన్న సంగతి తెలిసిందే. ఆ వజ్రం భారత్ కి చెందినదేనని నిరూపించే ఆధారాలు చాలానే ఉన్నాయి. ఆ వజ్రాన్ని భారత్ కి ఇవ్వాలంటూ ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి. మరికొన్ని వజ్రాల గురించి కూడా ఇతర దేశాలు అవి తమవేనంటూ.. తమకు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. కాగా.. తాజాగా… రాణి రాజదండంలోని వజ్రాల్లో తమకు చెందిన రత్నం కూడా ఉందని, దాన్ని వెనక్కి ఇచ్చేయాలని కోరింది. సీఎన్ఎస్ నివేదిక ప్రకారం.. బ్రిటన్ రాణి వద్ద ఉన్న కల్లినన్ I వజ్రం 1905లో దక్షిణాఫ్రికా గనుల్లో లభ్యమయ్యింది.
అప్పటికి ఆఫ్రికా దేశం వలస రాజ్యంగా కొనసాతుండటం వల్ల గ్రేట్ స్టార్‌ను (Great Star) ఆఫ్రికాలోని వలస పాలకులు బ్రిటిష్ రాజకుటుంబానికి అప్పగించారు. ప్రస్తుతం రాణికి చెందిన రాజ దండంలో దీనిని అమర్చారు. తక్షణమే కల్లినన్ వజ్రాన్ని దక్షిణాఫ్రికాకు అప్పగించాలని ఆ దేశానికి చెందిన సామాజిక కార్యకర్త తాండూక్సోలో సబేలో అన్నారు. ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. మన ప్రజాధనంతో మన దేశం, ఇతర దేశాలలో వెలికితీసిన ఖనిజాలు బ్రిటన్‌కు ప్రయోజనం చేకూరుస్తూనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.
వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని కోరుతూ change.orgలో ఆన్లైన్ పిటిషన్ ప్రారంభించారు. దానిపై 6,000 మందికి పైగా సంతకాలు చేశారు. దక్షిణాఫ్రికాకు చెందిన పార్లమెంట్ సభ్యుడు వుయోల్వేతు జుంగుల ట్విట్టర్లో స్పందిస్తూ.. బ్రిటన్ వల్ల నష్టపోయిన మా దేశానికి దొంగిలించిన మొత్తం బంగారం, వజ్రాలు తిరిగి ఇవ్వడమే పరిహారం’’ అని ట్వీట్ చేశారు.