మహిళల్లో ఎక్కువగా కనిపించే అండాశయ క్యాన్సర్ టాల్కం పౌడర్ వల్ల కూడా వచ్చే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Talcum Powder : అందరి ఇళ్లలోనూ సర్వ సాధారణంగా వాడే టాల్కం పౌడర్‌తో మహిళల్లో ఓవరీస్‌కు సంబంధించిన ఒవేరియన్ క్యాన్సర్( Ovarian Cancer) వచ్చే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మహిళలంతా జననాంగాల దగ్గరలో ఎలాంటి పౌడర్లనూ వాడొద్దని ఈ పరిశోధకులు చెబుతున్నారు. మొత్తం యాభై వేల మందికి పైగా మహిళలపై ఆరు సంవత్సరాల పాటు తాము ఈ పరిశోధన చేసినట్లు వెల్లడించారు.
ఈ అధ్యయనం ప్రకారం… టాల్కం పౌడర్‌ను(Talcum Powder) తయారు చేయడానికి ఆస్బెస్టాస్ అనే ఖనిజాన్ని వాడతారు. ఇది క్యాన్సర్‌ను కలిగించే కారకంగా పని చేస్తుంది. దీన్ని పీల్చినా, అవయవాల ద్వారా లోపలికి వెళ్లినా ప్రమాదమే. అయితే అండాశయ క్యాన్సర్‌ని ప్రాథమికంగా గుర్తించడం కష్టం. అది పొత్తి కడుపులోకి వ్యాపించేంత వరకు ఏదో అనారోగ్యం ఉందని గుర్తించలేం. దీంతో అది నయం కావడం కష్టంగా మారుతుంది. అందువల్లనే ఈ క్యాన్సర్ వచ్చిన వారిలో ప్రతి 130 మందిలో ఒకరు చనిపోతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఏటా దాదాపుగా మూడు లక్షల మందికి ఈ అండాశయ క్యాన్సర్(Ovarian Cancer) సంక్రమిస్తోంది. ప్రతి 87 మంది మహిళల్లో ఒకరికి ఈ క్యాన్సర్ వస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అందుకనే మహిళలు టాల్కం పౌడర్ విషయంలో జాగ్రత్తగా ఉండమని పరిశోధకులు చెబుతున్నారు. పొత్తి కడుపు కింది భాగంలో పౌడర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దని సూచిస్తున్నారు.