Rain Effect to General Election 2024 : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో పోలింగ్ రోజు రానే వచ్చేసింది. అయితే ఈ రోజు వాతావరణం కూడా ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేయగలిగే రీతితో ఉండొచ్చని వాతావరణ అధికారులు, అభ్యర్థులు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లోనూ ఓ వైపు భానుడు తన ప్రభావం చూపిస్తున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. మరో వైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాల బీభత్సమూ కొనసాగుతోంది.
ఇలా ఓ వైపు దంచి కొడుతున్న ఎండలు, మరో వైపు భారీగా కురుస్తున్న వర్షాలు(RAINS).. రెండూ కూడా నేటి పోలింగ్ శాతాన్ని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. కడప పజిల్లా పులివెందులలో ఈదురు గాలులతో వర్షం కురిసింది. దీంతో ఓటర్ల కోసం అక్కడ వేసిన తాత్కాలిక టెంట్లు కూలిపోయాయి. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో అకాల వర్షం కురిసింది. దీంతో పోలింగ్ కేంద్రంలోని సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొత్త పేట హైస్కూల్ గ్రౌండ్లో ఈవీఎంలను, ఇతర పరికరాలను అధికారులకు అందిస్తున్న క్రమంలో వర్షం రావడంతో గందరగోళం ఏర్పడింది.
మే 11 నుంచి 15 వరకు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఈదురు గాలులు, వడగళ్లు పడతాయని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అయితే నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల్లో(ELECTIONS) భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మరి కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికంగా కాస్తున్న ఎండ, వర్షాలు రెండూ కూడా ఓటర్లకు ఇబ్బందికరంగానే ఉన్నాయి.