తన ఫోన్ ని ట్యాప్ చేశారంటూ ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి….. సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. కాగా.. కోటం రెడ్డి ఆరోపణలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. అలాంటి పనులు చేయడం చంద్రబాబుకే అలవాటని అన్నారు. జగన్ వల్లే తనకు పదవి వచ్చిందని కోటంరెడ్డి ఎన్నో సార్లు చెప్పారని తెలిపారు.
కోటంరెడ్డికి చంద్రబాబు మంత్రి పదవి ఆఫర్ చేసినట్టున్నారని… పార్టీ మారాలనుకున్నారు కాబట్టే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వారు పార్టీ నుంచి పోతేనే మంచిదని చెప్పారు. జగన్ బలహీన వర్గాలకు పదవులను ఇస్తున్నారని తెలిపారు. జగన్ అబద్ధాలు చెప్పరని, ఏదైనా ముక్కుసూటిగానే చెపుతారని అన్నారు. ఐఫోన్ నుంచి ఐఫోన్ కు వెళ్లే కాల్ రికార్డ్ కాదని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. జగన్ కు నమ్మకం తప్ప అనుమానాలు ఉండవని చెప్పారు. జగన్ బీఫామ్ ఇస్తానంటే నెల్లూరు జనం క్యూ కడతారని అన్నారు.